
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
దహెగాం(సిర్పూర్): రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఫర్టిలైజర్ యజమానులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాంలను బుధవారం తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్‌లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కృత్రిమ ఎరువుల కొరత సృష్టించొద్దన్నారు. రైతులకు కనిపించేలా స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. నకిలీ ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలన్నారు. ఆయన వెంట ఏవో రామక్రిష్ణ తదితరులు ఉన్నారు.