ఏకరూపం.. ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

ఏకరూపం.. ఎప్పుడో..?

Sep 3 2025 4:57 AM | Updated on Sep 3 2025 4:57 AM

ఏకరూప

ఏకరూపం.. ఎప్పుడో..?

అంగన్‌వాడీ చిన్నారులకు పూర్తిస్థాయిలో అందని యూనిఫాం మొదటి విడతలో 8,118 మందికే పంపిణీ రెండో విడతలో జిల్లాకు చేరని క్లాత్‌

రెబ్బెన(ఆసిఫాబాద్‌): అంగన్‌వాడీ కేంద్రాల్లోని చి న్నారులకు పూర్తిస్థాయిలో యూనిఫాం అందలేదు. ప్రభుత్వం కేవలం ఒకవిడతలో కొందరికి పంపిణీ చేయగా, మిగిలిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో జిల్లాలోని చాలా మంది చిన్నారులు రంగుల దుస్తులతో కేంద్రాలకు హాజరవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు క్రీడాసామగ్రి పంపిణీ చేసింది. అలాగే చిన్నారులకు సైతం యూనిఫాం అందించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు యూనిఫాం అందించగా మిగిలిన కేంద్రాల వారికి మాత్రం ఇప్పటివరకు అందించలేదు. వాస్తవానికి జూన్‌లోనే ఏకరూప దుస్తులు అందాల్సి ఉండగా.. ప్రభుత్వం నుంచి క్లాత్‌ రావడంలో జాప్యం జరుగుతోంది.

రంగుల దుస్తులతోనే కేంద్రాలకు..

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓనమాలు నేర్చుకున్న విద్యార్థులు ప్రస్తుతం రంగు రంగుల దుస్తులను ధరించి కేంద్రాలకు వస్తున్నారు. దీంతో పసితనంలోనే ధనిక, పేద అనే తారతమ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని దూరం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంది స్తున్న మాదిరిగానే వీరికి సైతం ఉచితంగా యూనిఫాం అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు కూడా యూనిఫాంలు అందించాలని, అందుకు కావాల్సిన క్లాత్‌ సరాఫరా చేసింది. మొదటి విడతలో జిల్లాలోని సుమారు 410 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు క్లాత్‌ అందించింది. జిల్లా అధికారులు యూనిఫాం కుట్టే బాధ్యతను సెర్ప్‌ సిబ్బందికి అప్పగించారు. స్మాల్‌, మీడియం, లార్జ్‌ సైజుల్లో దుస్తులు కుట్టించి చిన్నారులకు అందించారు. ఇందులో చాలామందికి సైజులు సరిపోకపోవడంతో సూపర్‌వైజర్ల సహకారంతో సైజుల వారీగా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు యూనిఫాంలు తెప్పించారు. విద్యార్థులకు సైజులు సరిపోయేలా సర్దుబాటు చేశారు. మిగిలిన అంగన్‌వాడీకేంద్రాల్లో చదువుతున్నవారికి రెండో విడతలో క్లాత్‌ అందించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

నెలాఖరులోగా యూనిఫాం క్లాత్‌ రావొచ్చు

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులందరికీ యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో జిల్లాలో 8,118 మంది కోసం బట్ట సరఫరా చేయగా.. సెర్ప్‌ ద్వారా యూనిఫాంలు కుట్టించి పంపిణీ చేశాం. రెండో విడతలో జిల్లాలోని మిగిలిన చిన్నారులకు క్లాత్‌ ఇంకా రాలేదు. ఈ నెలాఖరు లోగా క్లాత్‌ వస్తుందని భావిస్తున్నాం. బట్ట రాగానే స్టిచ్చింగ్‌ చేయించి విద్యార్థులకు అందిస్తాం.

– భాస్కర్‌, ఐసీడీఎస్‌ పీడీ

22,817 మందికి లబ్ధి

ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు యూనిఫాం అందిస్తే జిల్లాలో 22,817 మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతోంది. 15 మండలాల పరిధిలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 3– 6 ఏళ్లలోపు చిన్నారులు 22,817 మంది ఉన్నారు. మొదటి విడతలో సుమారు 8,118 వేల మంది చిన్నారులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఇంకా సుమారు 14.7 వేల మందికి అందించాల్సి ఉంది. సెర్ప్‌ సిబ్బంది సకాలంలో యూనిఫాంలు అందించకపోవడంతో ఈ దఫా కుట్టు బాధ్యతలు స్వయం సహాయక సంఘాల్లోని నిరుద్యోగ మహిళలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. కుట్టుకూలి సెర్ప్‌ ద్వారా అందించడంతో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఈ కారణంగానే సకాలంలో యూనిఫాంలు అందడం లేదని గుర్తించారు. కలెక్టర్‌ ఆమోదంతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు డబ్బులు చెల్లిస్తే సకాలంలో యూనిఫాంలు అందుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు వరకు మిగిలిన అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు క్లాత్‌ వచ్చే అవకాశం ఉందని ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు.

ఏకరూపం.. ఎప్పుడో..?1
1/2

ఏకరూపం.. ఎప్పుడో..?

ఏకరూపం.. ఎప్పుడో..?2
2/2

ఏకరూపం.. ఎప్పుడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement