పాఠశాలల్లో పచ్చదనం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో పచ్చదనం

Sep 3 2025 4:57 AM | Updated on Sep 3 2025 4:57 AM

పాఠశాలల్లో పచ్చదనం

పాఠశాలల్లో పచ్చదనం

అమ్మ పేరుతో మొక్క నాటేలా ప్రోత్సహిస్తున్న విద్యాశాఖ ఇప్పటికే పోర్టల్‌లో ఐదు వేలకు పైగా ఫొటోలు అప్‌లోడ్‌ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత

కెరమెరి(ఆసిఫాబాద్‌): విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ 2.0’ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో మొక్కలు నాటుతున్నారు. పాఠశాల స్థాయిలో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పాఠశాలల్లో ఏకో క్లబ్‌ మిషన్‌ లైఫ్‌ పేరిట ప్రత్యేక క్లబ్‌లు ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే జిల్లా విద్యార్థులు 5 వేలకు పైగా మొక్కల నాటిన ఫొటోలను పోర్టల్‌ నమోదు చేసి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

తల్లి పేరుతో మొక్కలు

జిల్లాలో 561 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 100 ప్రాథమికోన్నత, 60 ఉన్నత, 15 కేజీబీవీలు ఉన్నాయి. 42 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌ 2.0 కార్యక్రమం ద్వారా ప్రతీ విద్యార్థి తల్లి పేరిట మొక్కలు నాటేలా విద్యాశాఖ ప్రోత్సహిస్తోంది. సృష్టిలో తల్లులు తమ పిల్లలను ఎంత ప్రేమగా కాపాడుకుంటారో.. అదే రీతిన నాటిన మొక్కను సంరక్షిస్తే అనుకున్న ప్రతిఫలం దక్కుతుంది. ప్రతీ విద్యార్థి పాఠశాలల ఆవరణలో తప్పనిసరిగా మొక్క నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతోంది. వీటిని సక్రమంగా సంరక్షిస్తే స్కూళ్ల ఆవరణలు పచ్చనిహారంలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధిహామీ పథకం కింద అధికారులు బడులకు మొక్కలు పంపిణీ చేశారు. అవసరమైన చోట ఉపాధ్యాయులు మరిన్ని మొక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. స్కూళ్లలో మొక్క నాటిన తర్వాత మిషన్‌ లైఫ్‌ పోర్టల్‌లో విద్యార్థులు ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రశంసాపత్రం సైతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు పది వేల మొక్కలు నాటగా, ఐదు వేల మంది విద్యార్థులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

హరిత రక్షణకు చర్యలు

అడవుల జిల్లాగా పేరున్న కుమురంభీం ఆసిఫాబాద్‌లోనూ క్రమంగా పచ్చదనం తగ్గుతోంది. ఇష్టారీతిన చెట్లు నరుకుతుండటంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావం భవిష్యత్తు తరాలపై పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం పేరిట జిల్లావ్యాప్తంగా ఖాళీ స్థలాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటుతోంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని సూచించడంతో విద్యాశాఖ అధికారులు సైతం హరిత రక్షణకు చర్యలు చేపట్టారు. విద్యార్థులను పచ్చదనం కాపాడటంలో భాగస్వాములను చేస్తున్నారు.

బాధ్యతగా తీసుకోవాలి

పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలి. తల్లి పేరుతో దాని సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి. మొక్కతో ఫొటో తీసుకుని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన వస్తుంది.

– ఉప్పులేటి శ్రీనివాస్‌,

జిల్లా సెక్టోరల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement