
నడవని రైలు.. తీరని తంటాలు!
సిర్పూర్(టి): సికింద్రాబాద్, కాజిపేట, బల్లార్హా మధ్య ఎప్పుడు ఏ రైలు రద్దవుతుంతో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఏడాది కాలంగా థర్డ్ లైన్ పనులు, రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ అధికారులు రైళ్లు నిలిపివేస్తున్నారు. గత నెల 29న భారీ వర్షాలు, వాతావరణ మార్పులు అంటూ కరీంనగర్– సిర్పూర్(టి) పుష్పుల్ ప్యాసింజర్ రైలు, కాజిపేట్–బల్లార్షా రామగిరి ప్యాసింజరు, కాజిపేట్– సిర్పూర్(టి) సింగరేణి ప్యాసింజరు, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలు రైళ్లు ఒకరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తిరిగి ఆగస్టు 30న పునఃప్రారంభించారు.
మూడో లైన్ పేరుతో..
సికింద్రాబాద్– బల్లార్షాల మధ్య నూతనంగా చేపట్టిన మూడో రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు ప్రకటించారు. కానీ థర్డ్‌లైన్ పనులు, ఇతర మరమ్మతులు, స్టేషన్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నారు. అధికారుల అనాలో చిత నిర్ణయాలతో జిల్లా ప్రయాణికులతోపాటు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు సిర్పూర్(టి), కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌ల నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. బల్లార్షా వరకు నడిచే రైళ్లలో వందలాది మంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ప్రయాణిస్తుంటారు.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం
రైళ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నాం. ఆర్థికంగా భారం పడుతుంది. రైల్వే అధికారులు స్పందించి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్ ప్యాసింజరు రైళ్లను పునరుద్ధరించాలి.
– నులిగొండ మహేశ్, సిర్పూర్(టి)
ఇబ్బంది పడుతున్నాం
బల్లార్షా– సికింద్రాబాద్ మధ్య రైళ్లు తరుచూ రద్దు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ప్రతీ రోజు నడిచే రైళ్లు కూడా ఎప్పుడు రద్దవుతున్నాయో తెలియడం లేదు. తరచూ రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలి.
– నగ్రాడె రాజు, సిర్పూర్(టి)
హాల్టింగ్ మళ్లీ ఎప్పుడో..?
భాగ్యనగర్ రైలు గతంలో సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ మీదుగా నడిచింది. ప్రస్తుతం సికింద్రాబాద్– కాగజ్‌నగర్ వరకు మాత్రమే కొనసాగుతోంది. కాజిపేట్– నాగ్‌పూర్ ప్యాసింజర్‌కు సిర్పూర్(టి)లో స్టాప్ లేదు. గతంలో నాగ్‌పూర్ ప్యాసింజర్‌గా ఉండగా ప్రస్తుతం కాజిపేట్– నాగ్‌పూర్ అజ్నీ ప్యాసింజర్ రైలుగా పిలుస్తున్నారు. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్‌లో గతంలో హాల్టింగ్ ఉన్న భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్ ప్యాసింజర్‌కు ప్రస్తుతం ఎందుకు హాల్టింగ్ కల్పించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో మరిన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అలాగే కోవిడ్ సమయంలో మార్చి 2020లో లాక్‌డౌన్ విధించగా అప్పుడు రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. లాక్‌డౌన్ అనంతరం పునఃప్రారంభించినా సిర్పూర్(టి)లో ఆపడం లేదు. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ తదితర మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నడవని రైలు.. తీరని తంటాలు!

నడవని రైలు.. తీరని తంటాలు!