
పల్లెల్లో పనుల జాతర
ఈ నెల 22న ప్రారంభించేందుకు ఏర్పాట్లు
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 22న పనుల జాతర – 2025 కార్యక్రమం చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఏ ర్పాట్లు సిద్ధం చేశాయి. ఆ రోజున ఉపాధిహామీ పథకంతోపాటు వాటర్‌షెడ్ పథకం, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛ భారత్ వంటి విభాగాల్లో చేపట్టిన, చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 951 పనులు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పనుల జాతర –2025 నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి దత్తారావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 951 పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేయనునున్నారు. ప్రారంభోత్సవాలకు స్థానిక ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. పనుల జాతరలో భాగంగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి– ఉపాధి భరోసా కింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులైన పశువుల కొట్టం, కోళ్లు, గొర్రెల షెడ్లు, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోల్లా పిట్ నిర్మాణం, జలనిధి పథకం కింద వాన నీటి సంరక్షణ, భూగర్బ జలాలు పెంచే ఫారం పాండ్స్, ఊట కుంటలు వంటి పనులు ప్రారంభించనున్నారు. రైతులు, లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల్లో మంజూరు ఉత్తర్వులు అందించనున్నారు. అలాగే ఉపాధిహామీ పథకంలో ఎక్కువ రోజులు పని చేసిన కూలీలతోపాటు దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను సన్మానిస్తామని అధికారులు వెల్లడించారు.