
తిర్యాణి బ్లాక్ పురోగతి సాధించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో తిర్యాణి బ్లాక్ పురోగతి సాధించి ముందు వరుసలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. తిర్యాణి మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం విద్య, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమ, ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, మిషన్ భగీరథ, గ్రా మీణాభివృద్ధి శాఖల అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స అందించాలన్నారు. ప్రతినెలా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సరైన పోషకాహారం అందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఎంపీడీవో మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.