నియంత్రణ కేంద్రం.. నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

నియంత్రణ కేంద్రం.. నిరుపయోగం

Aug 23 2025 2:51 AM | Updated on Aug 23 2025 2:59 AM

● జిల్లాలో పెరుగుతున్న కుక్కల సంతతి ● ప్రారంభానికి నోచుకోని డాగ్స్‌ రిహాబిటేషన్‌ కేంద్రం

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో కుక్కల జనాభాను నియంత్రణకు కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన డాగ్స్‌ రిహాబిటేషన్‌ కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఓ వైపు కుక్కలు మనుషులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీధికుక్కల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శునకాలకు తప్పనిసరిగా స్టెరిలైజేషన్‌ చేసిన తర్వాతే బయటికి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ కాగజ్‌నగర్‌లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కేంద్రం నిరుపయోగంగా మారింది.

రూ.20లక్షలతో నిర్మాణం

కుక్కల నియంత్రణలో భాగంగా కాగజ్‌నగర్‌లోని సీబాబుకాలనీలో గల ప్రభుత్వ స్థలంలో రూ.20 లక్షలతో డాగ్స్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ భవనాన్ని నిర్మించారు. కుక్కల జనాభాను అరికట్టేందుకు శస్త్ర చికిత్సలు, స్టెరిలైజేషన్‌, యాంటీ రెబీస్‌ వ్యాక్సిన్లు తదితర చర్యలు ఇక్కడ చేపట్టాల్సి ఉంది. ఈ సెంటర్‌లో కుక్కలకు చికిత్స చేసేందుకు కావాల్సిన సర్జికల్‌ థియేటర్లు, రికవరీ యూనిట్లు, ఇతర మౌలి క సదుపాయాలు సమకూర్చాలి. భవన నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు సిబ్బందిని నియమించలేదు. ఈ కారణాలతోనే కేంద్రం ప్రారంభంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ప్రారంభిస్తాం

పట్టణంలో కుక్కల నియంత్రణకు సీబాపుకాలనీలో రిహాబిటేషన్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తయ్యింది. ప్రారంభంలో జరుగుతున్న జాప్యం విషయాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ దృష్టికి ఇటీవల తీసుకెళ్లాం. శస్త్ర చికిత్సకు కావాల్సిన పరికరాలు సమకూర్చి, సిబ్బందిని నియమిస్తాం. త్వరలోనే కేంద్రం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.

– రాజేందర్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌

పెరుగుతున్న కుక్కల సంఖ్య

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. సుమారు 70 వేల మంది నివస్తున్నా రు. రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ వార్డులోని ఖాళీ ప్రదేశాలు, ఖాళీ క్వార్టర్లలో తలదాచుకుంటూ సంతానం పెంచుకుంటున్నాయి. కుక్కల నియంత్రణ కు పటిష్టమైన ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (స్టెరిలైజేషన్‌) లేకపోవడంతో వాటి సంతతి పెరుగుదలపై అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాత్రిపూట రోడ్లపై తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులకు దిగుతున్నాయి. ఇ టీవల పట్టణంలోని కాపువాడకు చెందిన మహిళపై శునకాలు దాడి చేసి గాయపర్చాయి. అధి కారులు స్పందించి మున్సిపాలిటీలోని డాగ్స్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ను ప్రారంభించి కుక్కలకు స్టెరిలైజేషన్‌ నిర్వహించి వాటి జనాభాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

నియంత్రణ కేంద్రం.. నిరుపయోగం1
1/1

నియంత్రణ కేంద్రం.. నిరుపయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement