
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): రోడ్డు, రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. వాంకిడి మండలంలోని టోల్‌ప్లాజా వద్ద అధిక శబ్దానిచ్చే 50 మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించారు. ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం పెరుగుతుందన్నారు. నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మాడిఫైడ్ సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా వచ్చిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని సూచించారు. అలాగే డీజేల ఏర్పాటుకు అనుమతి లేవని, రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత ధ్వని కాలుష్యం కలిగించేలా స్పీకర్లు పెట్టొద్దన్నారు. కార్యక్రమంలో సీఐలు బాలాజీ వరప్రసాద్, సత్యనారాయణ, రమేశ్, సంజయ్, ఎస్సైలు మధుకర్, చంద్రశేఖర్, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.