
పాముకాటుతో బాలుడి మృతి
పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కొడప నవదీప్(11) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నేలపై నిద్రించాడు. సుమారు 9గంటల ప్రాంతంలో కట్లపాము నవదీప్ చేతిపై మూడుసార్లు కాటువేసింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లైటు వేశారు. పక్కనే ఉన్న కట్లపామును గమనించి కొట్టి చంపారు. బాలుడిని చికిత్స కోసం కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సిర్పూర్(టి)లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నవదీప్ ఇటీవలే ఇంటికి వచ్చాడు. పాముకాటుతో కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు సులోచన, జగదీష్ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబానికి పలువురు దాతలు ఆర్థికసాయం అందించారు.