
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌కు చెందిన మీరారాణి మండల్ తన పేరుతో గల లావుణి పట్టా భూమిని తమ్ముడు పట్టా చేసుకున్నాడని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరింది. జిల్లాలో ఔట్‌సోర్సింగ్ పోస్టులను సమానంగా కేటాయించాలని మిత్ర సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ కొండగొర్ల చంద్రశేఖర్ దరఖాస్తు సమర్పించాడు. బూర్గుడ సమీపంలోని ఫోర్‌లేన్ రహదారి పక్కన ఖాళీ స్థలాలను కొంతమంది రైతులు ఆక్రమించుకోవడంతో వరదతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బూర్గుడ రైతులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ తన తండ్రి మృతి చెందాడని, వారసత్వ ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన ఒడ్డే పెంటన్న దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడ శివారులో తన భూమిని అక్రమంగా మార్చిన పట్టా రద్దు చేయాలని ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్‌కు చెందిన జాడి పుల్లయ్య విన్నవించాడు. ఆసిఫాబాద్ మండలం జెండగూడకు చెందిన కామెడె నర్సింగ్‌రావు తనకు వారసత్వంగా సంక్రమించిన భూమికి పట్టా పాస్‌బుక్ జారీ చేయాలని కోరాడు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన పొన్నం పురుషోత్తం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించాడు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమన్వయంతో దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.