మార్చిలో 116శాతం బొగ్గు ఉత్పత్తి
● 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 97శాతం.. ● వివరాలు వెల్లడించిన ఇన్‌చార్జి జీఎం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా మార్చిలో 116 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏరియా సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. గడిచిన నెలలో ఏరియాకు 4.70లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఏరియా 5.43 లక్షల టన్నులతో 116 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. కై రిగూడ ఓసీపీలో 4.20లక్షల టన్నులకు గరిష్టంగా 5.43లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించగలిగామన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియా 97 శాతం ఉత్పత్తి నమోదు సాధించిందని తెలిపారు. అధిక వర్షాలతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు 38.50లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 37.50 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించామన్నారు. వాస్తవానికి ఏరియా వందశాతం ఉత్పత్తి సాధించినట్లేనని, గోలేటి ఓసీపీ ద్వారా ఉత్పత్తి ప్రక్రియ చేపట్టకపోయినా 2024– 25 ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించిందని అన్నారు. కై రిగూడ ఓసీపీ ద్వారా వందశాతం ఉత్పత్తి సాధించగా, గోలేటి ఓసీపీకి కేటాయించిన లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యం మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఏరియాలో వందశాతం ఉత్పత్తి సాధనకు ఉద్యోగులు, అధికారులు ఎంతో సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, సీనియర్ పర్సనల్ అధికారులు పాల్గొన్నారు.


