బడుల్లో రోబోటిక్స్
పెంచికల్‌పేట్(సిర్పూర్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించి నూతన ఆవిష్కరణల్లో భాగస్వాములను చేయడానికి పీఎం శ్రీ పాఠశాలలు, కళాశాలల్లో రోబోటి క్స్ విద్యను నూతనంగా ప్రవేశపెట్టారు. ఏఎండీ సంస్థ సహకారంతో సోహమ్ అకాడమీ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. అటల్ థింకింగ్ ల్యాబ్‌ల ద్వారా సైన్స్‌పై మక్కువ కల్పించడానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకం చేస్తున్నారు. జిల్లాలోని 12 పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని 475 మంది బాలికలు, 543 మంది బాలురుకు మొ త్తంగా 1,018 మందికి ప్రత్యేకంగా ల్యాబ్‌ల్లో ఒకరోజు శిక్షణ కల్పించారు. అనంతరం ప్రత్యేకమైన కిట్లు పంపిణీ చేశారు.
సైన్స్‌పై మక్కువ
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో ఎలక్ట్రానిక్స్‌పై శిక్షణ అందించడం ఉపయోగకరంగా ఉంది. రోబోటిక్స్ కిట్ల ద్వారా బోధిస్తుండటంతో సైన్స్‌పై మక్కువ పెరిగింది. సైన్సు ఉపాధ్యాయులతో ప్రతీ వారం రెండు పీరియడ్స్ రోబోటిక్స్‌పై శిక్షణ అందిస్తున్నాం. – విజయ నిర్మల,
హెచ్‌ఎం, పీఎంశ్రీ ఉన్నత పాఠశాల, పెంచికల్‌పేట్
ప్రత్యేక శిక్షణ అందించి..
జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్ రెబ్బెన, జీహెచ్‌ఎస్(ఓల్డ్) కాగజ్‌నగర్, జీహెచ్‌ఎస్ నజ్రూల్‌నగర్, టీఎంఆర్‌ఐఈఎస్ గన్నారం, టీజీఎంఎస్ ఆసిఫాబాద్, టీఎస్‌ఆర్‌ఐఈఎస్ ఆసిఫాబాద్, జెడ్పీహెచ్‌ఎస్ ఆసిఫాబాద్, జెడ్పీహెచ్‌ఎస్ వాంకిడి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వాంకిడి, జెడ్పీహెచ్‌ఎస్ సిర్పూర్(టి), జెడ్పీహెచ్‌ఎస్ బాబాసాగర్, జెడ్పీహెచ్‌ఎస్ పెంచికల్‌పేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోబోటిక్స్ విద్య బోధిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన చార్టులు, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ప్రత్యక్షంగా శిక్షణ అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ, మోటార్లు, ప్రాజెక్టుల తయారీ, సెన్సార్లు, రోబోల తయారీపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తయారు చేసిన సంబంధిత ప్రాజెక్టుల వివరాలను ప్రతినెలా యాప్‌లో నమోదు చేస్తున్నారు. డ్రోన్లు, బాంబ్ డిటెక్టింగ్ పరికరం, సోలార్ విద్యుత్ వీధి దీపాలు, డోర్ అన్ లాంకింగ్ సిస్టం, హీట్ గన్స్, కుట్టు మిషన్లు వంటి ప్రాజెక్టులను రూపొందించారు. పాఠశాలల్లో తరగతులతోపాటు ప్రత్యేకంగా జూమ్ ద్వారా ఆన్‌లైన్ శిక్షణ కల్పిస్తున్నారు. సైన్సు ఉపాధ్యాయులతో రోబోటిక్ విద్యలో మెలకువలను నేర్పిస్తున్నారు. బాలబాలికలు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలు జిల్లాస్థాయిలో నిర్వహించే సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తున్నారు.
బడుల్లో రోబోటిక్స్


