నారుపై చలిపంజా
కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మందగించిన ఎదుగుదల జిల్లాలో వరినాట్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి పంట దిగుబడిపైనా ప్రభావం
రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది. అయినా రైతులు కుంగిపోకుండా యాసంగి పంటల సాగు పనులు చేపట్టారు. అయితే సీజన్ ఆరంభంలోనే చలితీవ్రత వారికి తలనొప్పిగా మారింది. నెల రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. చలి పంజాకు వరినారు ఎదుగుదల మందగించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ నమోదు అవుతుండటంతో ఆశించిన ఎదుగుదల లేక తెగుళ్లు సోకుతున్నాయి.
ఎదుగుదల లేక..
దహెగాం, రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లోని రైతులు యాసంగి వరిసాగు కోసం పనులు ప్రారంభించారు. ముఖ్యంగా రెబ్బెన మండల కేంద్రంతోపాటు నంబాల, నారాయణపూర్, కొమురవెళ్లి, పుంజుమేరగూడ, నక్కలగూడ, కై రిగాం ప్రాంతాల్లో యాసంగి వరి సాగు చేస్తుండగా, గంగాపూర్, కొండపల్లి, నేర్పల్లి ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తున్నారు. తుపాన్ కారణంగా వరికోతలు కాస్త ఆలస్యమయ్యాయి. దీంతో రైతులు నవంబర్ రెండో వారం నుంచి నార్లు పోయడం ప్రారంభించారు. అప్పటినుంచి చలి రోజురోజుకూ పెరుగుతుండటం పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాత్రి, తెల్లవారుజామున చలిగాలులు వీస్తున్నాయి. నారులో ఎదుగుదల లేక, తెగుళ్లు సోకుతున్నాయి. రైతులు నారును కాపాడుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మొలకలు ఎర్రబా రుతుండటంతో నివారణకు రెండు, మూడు రోజు కు ఒకసారి రసాయనిక మందులు పిచికారీ చేస్తు న్నారు. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు.
నాట్లపైనా ప్రభావం
అధిక చలితో నారు ఎదుగుదల లేకపోవడంతో దాని ప్రభావం వరినాట్లపై పడనుంది. సాధారణంగా నారు పోసిన 25 నుంచి 30 రోజుల్లోగా నాట్లు వేసుకుంటే మంచి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం దాటితే దిగుబడి తగ్గుతుంది. ఆలస్యంగా నాటు వేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో పిలకలు రావు. కొంత మంది రైతులు నారు పోసి 25 రోజులు గడుస్తున్నా చలితీవ్రత కారణంగా మొలకలు మూడు ఇంచుల ఎత్తు వరకు కూడా పెరగలేదు. అనుకున్న సమయంలోగా నాటు వేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే విత్తనాల్లో మొలక శాతం తగ్గి ఒక్కో రైతు రెండు, మూడుసార్లు నార్లు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వారిపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది. మొలిచిన నారు సైతం ఎర్రబారి చనిపోతోంది. కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మరో 20 రోజులు దాటితే తప్ప నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. అదును దాటితే కోతల సమయంలో ఆకాల వర్షాల రూపంలో మరోసారి ముప్పు పొంచి ఉండనుంది.
మొలకలు రాక మరోసారి పోసుకున్న నారుమడి
నంబాలలో ఎదుగుదల లేని వరినారు
యాజమాన్య పద్ధతులు పాటించాలి
చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వరినారుపై అధిక ప్రభావం చూపుతోంది. రైతులు పంటను కాపాడుకునే యాజమాన్య పద్ధతులు పాటించాలి. రాత్రిపూట ఉన్న నీటిని తొలగించి ఉదయమే కొత్త నీరు అందించాలి. చలి ప్రభావంతో జింక్ లోపం ఏర్పడి పంటల్లో ఎదుగుదల ఉండదు. నివారించేందుకు లీటర్ నీటికి 2గ్రాముల చొప్పు జింక్‌ను కలిపి పిచికారీ చేయాలి. వీలైతే రాత్రిపూట వరినారుపై మంచు పడకుండా కవర్లు కప్పి ఉంచి ఉదయం తొలగించాలి. ఈ విధమైన చర్యలు చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. – దిలీప్, మండల వ్యవసాయాధికారి, రెబ్బెన
నారుపై చలిపంజా
నారుపై చలిపంజా


