అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం హాజరైన రాష్ట్ర మంత్రి జూపల్లి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వుతో కలిసి ప్రారంభించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యాలు తీసుకురావద్దని అన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మంచిర్యాలకు గ్రీన్‌ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. రంగు మారిన సోయా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు పీజీ సీట్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వేశామని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పె షాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. రాజకీయాలు స్నేహపూర్వకంగా ఉండాలని, గతంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్‌పేయిని ప్రతినిధిగా పంపారని గు ర్తు చేశారు. అయితే ప్రధానమంత్రి రామగుండంలో జరిగిన కార్యక్రమానికి హాజరైతే అప్పటి ముఖ్య మంత్రి హాజరు కాలేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు మంచిది కాదని పేర్కొన్నారు. రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించి సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తే బాగుంటుందన్నారు. జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని, జి ల్లాలో 8లక్షల మందికి కార్డులు అందజేసినట్లు పే ర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు సర్వే జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు పత్తి కొనుగో ళ్లు చేస్తామని పేర్కొన్నారు.
జిల్లాకు ఎంత చేసినా తక్కువే..: మంత్రి జూపల్లి కృష్ణారావు
వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రిమ్స్‌కు అవసరమైన వైద్యపోస్టులు మంజూరు చేసేలా కృషి చేస్తానని పే ర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.800 కోట్ల సీఎంఆర్ నిధులు విడుదల చేసిన ట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6,956 స్టాఫ్‌నర్స్ పోస్టులను, 4,338 వైద్య పోస్టులను భర్తీ చేసిన ట్లు తెలిపారు. రిమ్స్‌లో ప్రతీ రోగికి నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపడితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక కల్చరల్ బిల్డింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌లు మాట్లాడారు. రిమ్స్‌తోపాటు ఉట్నూర్, బోథ్ ఆ స్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చే యాలని, ఇచ్చోడ పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రి గా మార్చాలన్నారు. జన్నారంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి వైద్యులకు రూ. 5లక్షల వేతనం ఇచ్చి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిమ్స్‌లో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభంతో అత్యవసర సేవలు మెరుగుపడతా యని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, కొమురయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూ ల నర్సయ్య, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీ ఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.


