రైల్వే వడ్డన!
మరోసారి పెరిగిన టికెట్ ధరలు అమలులోకి వచ్చిన కొత్త చార్జీలు ఈ ఏడాదిలో రెండుసార్లు పెంపు భవిష్యత్‌లోనూ పెరిగే అవకాశం ప్రయాణికులపై అదనపు భారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వేశాఖ ప్రయాణికులపై చార్జీల భారం మోపింది. క్రమంగా టికెట్ల రేట్లు పెంచుతూ పోతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు చార్జీలు పెంచింది. సమీప భవిష్యత్‌లోనూ ఇంకా చార్జీలు పెంచుతారనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల పెంచిన టికెట్ల ధరలు ఈ నెల 26నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో శుక్రవారం నుంచే రాకపోకలు సాగించిన దూరప్రాంత ప్రయాణికులపై అదనపు భారం పడింది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లతో పాటు స్లీపర్ క్లాస్‌ల చార్జీలు పెరిగాయి. అంతేకాకుండా నెలవారీగా తీసుకునే సీజనల్ టికెట్ చార్జీలు స్వల్పంగా పెంచారు. రైల్వేలో కిలో మీటర్ల దూరాన్ని బట్టి స్లాబ్ ప్రకారం చార్జీలుంటా యి. ప్రతీ 50 కిలో మీటర్ల దూరానికి అన్‌రిజర్వ్‌డ్, స్లీపర్, ఏసీ కేటగిరీలుగా లెక్కగడతారు.
215 కి.మీ. దాటితే పెంపు
రోడ్డు మార్గం కంటే రైలు ప్రయాణమే తక్కువ ఖ ర్చుతో వేగంగా, సౌకర్యవంతంగా వెళ్లొచ్చని పేద, మధ్య తరగతి ప్రజలు అధిక ఆసక్తి చూపిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రైల్వే మార్గమైన కాజీపేట, బల్లార్షా సెక్షన్, ఇటు వరంగల్, విజయవాడ, చైన్నె దాకా వెళ్లే ప్రయాణికులకు దూరభారంతో రోడ్డు వెంట కంటే రైలు ప్రయాణమే ఉత్తమం. వీటితో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబా ద్, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా మీదుగా నాగ్‌పూర్ అటు న్యూఢిల్లీ దాకా, ఇటువైపు సికింద్రాబాద్, వ రంగల్, ఖమ్మం, భద్రాచలం రోడ్, విజయవాడ, తి రుపతి, బెంగళూరు, చైన్నె వరకు రాకపోకలు సాగి స్తుంటారు. అయితే దూరప్రాంతాలకు వెళ్తే ప్రతీ 215 కిలో మీటర్లు దాటితే పెరిగిన రేట్లు వర్తిస్తున్నా యి. సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి కరీంనగర్, కాజీపేట, వరంగల్, చంద్రపూర్ దాకా చార్జీలు పెరగలేదు. సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు రూ.5 పెరిగితే, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రూ.15 చొప్పున ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు చార్జీలు పెరిగాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి నాగపూర్ జంక్షన్ వరకు అన్ రిజర్వ్‌డ్ టికెట్‌కు రూ.15చొప్పున, సికింద్రాబాద్ నుంచి మంచిర్యాలకు సూపర్‌ఫాస్ట్ స్లీపర్ క్లాస్ చార్జీ నిన్నటి వరకు రూ.210 ఉండగా, రూ.215కు చేరింది. అలాగే బెల్లంపల్లి వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్ స్లీపర్ క్లాస్ చార్జీ రూ.225కు పెరిగింది. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల వరకు మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్‌కు రూ.180నుంచి రూ.185కు పెరిగింది. ఇంటర్ సిటీ, భాగ్యనగర్‌కు మంచిర్యాల నుంచి సికింద్రాబాద్‌కు రూ.95నుంచి రూ.100కు చేరింది. అదే సూపర్ ఫాస్ట్‌కు రూ.110నుంచి రూ.115కు పెరిగింది. ఇంటర్‌సిటీ, భాగ్యనగర్ రైళ్లకు బెల్లంపల్లి–సికింద్రాబాద్ వరకు రూ.100 నుంచి రూ.105కు, సూపర్‌ఫాస్ట్ రూ.115నుంచి రూ.120కి పెరిగింది. ఇంటర్‌సిటీ, భాగ్యనగర్ రైళ్లకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రూ.120 నుంచి రూ.135కు, సూపర్‌ఫాస్ట్‌కు రూ.135నుంచి రూ.150కి పెరిగింది.
సామాన్యుడిపై భారమే
ఈ ఏడాది రెండుసార్లు చార్జీలు పెంచారు. పెరిగింది స్వల్పమే కానీ, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎక్కువ మందితో దూరప్రయాణం చేస్తే ఆర్థిక భారం పడుతుంది.
– అంకిత్ ఫణిశర్మ,
రైల్వే ఫోరం అధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ
రైలు ప్రయాణ మార్గం పెరిగిన చార్జీ
ఎక్స్‌ప్రెస్ (అన్‌రిజర్వ్‌డ్) మంచిర్యాల–నాగ్‌పూర్ వరకు రూ.15 సూపర్‌ఫాస్ట్ సికింద్రాబాద్–మంచిర్యాల రూ.5
సూపర్‌ఫాస్ట్ సికింద్రాబాద్–బెల్లంపల్లి రూ.15
ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్–బెల్లంపల్లి రూ.5
ఎక్స్‌ప్రెస్ మంచిర్యాల–భద్రాచలంరోడ్ రూ.5
ఎక్స్‌ప్రెస్ బెల్లంపల్లి–భద్రాచలంరోడ్ రూ.10
ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్–భద్రాచలంరోడ్ రూ.15


