ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఇందిరమ్మ 1, 2వ కాలనీల్లో ఇళ్ల సర్వే ముమ్మరంగా సాగుతోంది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది 50మంది బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో నివాసాల వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇళ్లలో ఎప్పటి నుంచి ఉంటున్నారు, పట్టాదారులు, కొనుగోలు దారులెవరనే వివరాలు తెలుసుకుంటున్నారు. ఏదులాపురం సర్వే నంబర్ 142లోని 25 ఎకరాల్లో ప్రభుత్వం నిరుపేదలకు 72 గజాల చొప్పున ప్లాట్లకు పట్టాలు ఇచ్చింది. కొందరు ఇంటి నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు ఇతరులకు అమ్ముకున్నారు. దీంతో అసలైన పట్టాదారుల కంటే కొనుగోలు చేసిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలియడం, ఒక్కో పట్టా ఆరు నుంచి ఎనిమిది మంది వరకు చేతులు మారినట్లు తెలియడంతో సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చకచకా సర్వే చేస్తున్నారు.


