చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు | - | Sakshi
Sakshi News home page

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

ఖమ్మం లీగల్‌: చెల్లని చెక్కు కేసులో ఖమ్మంలోని బ్రాహ్మణబజార్‌కు చెందిన శేషు కుమారికి ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.7.55 లక్షల నష్టపరిహారం చెల్లించి రూ.5 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్ట్‌ న్యాయదికారి కాకుమాను జ్యోతిర్మయి మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా.. ఖమ్మం బోనకల్‌ రోడ్డు శ్రీరామ్‌ నగర్‌కు చెందిన ఎడ్ల లక్ష్మీనారాయణ వద్ద నిందితుడు తన కుటుంబ అవసరాల నిమిత్తం 2018, జనవరి 6న రూ.3లక్షలు అప్పుగా తీసుకొని ప్రాంసరీ నోటు రాసిచ్చాడు. ఆ తర్వాత తన రుణం చెల్లించాలని ఒత్తిడి చేయగా 2020, సెప్టెంబర్‌ 3న రూ.5 లక్షలకు చెక్కు ఇవ్వగా.. ఫిర్యాది తన బ్యాంక్‌ ఖాతాలో జమ చేయగా సరిపడా నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో ఫిర్యాది లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో కేసు దాఖలు చేయగా.. విచారించిన న్యాయాధికారి నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

పోడు భూమి ఆక్రమణ కేసులో వ్యక్తి అరెస్ట్‌

రఘునాథపాలెం: అటవీ భూమిని పోడు సాగు పేరుతో ఆక్రమణకు పాల్పడిన కేసులో రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన భూక్యా మోహన్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ డీఆర్‌ఓ సాల్మన్‌రాజు తెలిపారు. 2023లో నమోదైన కేసులో మోహన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు కిరణ్‌, కన్నయ్య, రాంబాబు, వెంకటరమణ పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

వైరారూరల్‌: ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్‌బియ్యాన్ని సివిల్‌సప్లయి అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో బలగాని నర్సింహారావు ఇంట్లో రేషన్‌ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మేరకు నర్సింహారావు ఇంట్లో నిల్వ ఉంచిన తొమ్మిదిన్నర క్వింటాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకుని సీజ్‌ చేశారు. అనంతరం నర్సింహారావు మీద ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఖమ్మం అర్బన్‌: ఖమ్మంనగరం ఖానాపురంకు చెందిన అక్కి వీరబాబు (48) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గత ఆరు నెలల క్రితం వీరబాబు భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమాన మద్యానికి బానసై మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాష్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారికి వివాహాలు జరిగినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement