● గిరిజన గురుకుల సొసైటీ రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి ● తనికెళ్ల గురుకులంలో ఎంట్రప్రెన్యూర్‌షిప్
కొణిజర్ల: గిరిజన బాలికలు తమ చదువుతోపాటు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ రాష్ట్ర సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని తనికెళ్లలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామిక వికాసం, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఎకో సిస్టమ్ కార్యక్రమాన్ని ఆమె భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మి కళాశాల బాలికలకు తయారు చేసిన అగర్ బత్తీలు, వెదురు, జనప నార వస్తువులను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్ కె.రజని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బాలికలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముడానికి ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థ కలిపిస్తామన్నారు. విద్యార్థినులు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నత స్థాయి కి ఎదగాలన్నారు. తనికెళ్ల కళాశాలలో చదువుతూ జాతీయ, రాష్ట్ర స్థాఽయిలో ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలకు ఎంపికై న బాలికలను సన్మానించారు.
రూ.2 లక్షలు ప్రకటించిన పీఓ...
తనికెళ్ల గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల బాలికలు తయారు చేస్తున్న వివిధ రకల వస్తువులు పరిశీలించిన ఐటీడీఏ పీఓ బి.రాహుల్ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఐటీడీఏ భద్రాచలం నుంచి రూ.2 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కళాశాలలో నిర్వహిస్తున్న ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో భాగంగా బాలికలకు టైలరింగ్, మగ్గంవర్క్, బ్యుటీషీయన్ కోర్సు, జ్యూయలరీ మేకింగ్, సీడ్ పెన్ మేకింగ్, తాటిఆకులతో బుట్టలు, పిండి వంటలు, రొట్టెలు, అగర్‌బత్తీల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి, ఐటీడీఏ పీఓ బి రాహుల్‌లు బాలికలకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, కళాశాల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


