ఆందోళనలో లబ్ధిదారులు..
కల్యాణలక్ష్మి రద్దుకు ప్రభుత్వం కుట్ర
ప్రభుత్వ జీవోలపై హైకోర్టు స్టే
ఆరు వేలకు పైగా పెండింగ్ ఫైళ్లు
అత్యధికంగా ఖమ్మం అర్బన్‌లోనే..
ఆమోదం కోసం లబ్ధిదారుల
ఎదురుచూపులు
8లో
ఖమ్మంమయూరిసెంటర్: పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు తదుపరి విచారణ వరకు ఎలాంటి నగదు చెల్లింపులు జరపొద్దని ఆదేశించడంతో వేలాది కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేయగా.. ఆమోదం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
నిలిచిన ప్రయోజనాలు..
జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల నుంచి మొత్తం 65,782 దరఖాస్తులు వచ్చాయి. తహసీల్దార్ స్థాయిలోనే ఇంకా 877 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా.. తహసీల్దార్ పరి శీలన అనంతరం ప్రజాప్రతినిధుల ఆమోదం కోసం 1,496 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ప్రజాప్రతినిధుల ఆమోదం పొంది ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సినవి 426వరకు ఉన్నాయి. ఇక సాంకేతిక, అర్హతల కారణాలతో తహసీల్దార్ స్థాయిలో 2,972, ప్రజాప్రతినిధుల వద్ద 46 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కాగా, జిల్లాలో మొత్తం 65,782 దరఖాస్తులకు గాను 59,768 మందికి ట్రెజరీ ద్వారా బిల్లులు మంజూరయ్యాయి.
ఖమ్మం అర్బన్‌లోనే అత్యధికం..
ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే అత్యధికంగా 50,068 దరఖాస్తులు నమోదు కాగా, ఒక్క ఖమ్మం అర్బన్ పరిధిలోనే 10,077 దరఖాస్తులు ఉన్నాయి. ఖమ్మం అర్బన్‌లో 294 దరఖాస్తులు ఎమ్మార్వో వద్ద, 339 దరఖాస్తులు ఎమ్మెల్యే ఆమోదం కోసం నిలిచిపోయాయి. ఖమ్మం రూరల్‌లో 71 దరఖాస్తులు తహసీల్దార్ వద్ద పరిశీలనలో ఉన్నాయి. కల్లూరు డివిజన్ పరిధిలో మొత్తం 15,714 దరఖాస్తులకు గాను, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 25 చొప్పున దరఖాస్తులు తహసీల్దార్ వద్ద పరిశీలన దశలో నిలిచిపోయాయి.
కూతుళ్ల పెళ్లిళ్ల కోసం అప్పులు చేసి, ప్రభుత్వం అందించే రూ.1,00,116 ఆర్థిక సాయంతో ఆ అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డ పేద కుటుంబాలకు హైకోర్టు ఉత్తర్వులు మింగుడు పడటం లేదు. సెప్టెంబర్ 9 వరకు తదుపరి విచారణ వాయిదా పడటంతో, ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి, లబ్ధిదారులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


