ఎఫ్‌ఎఫ్‌ఎస్ బృందం దృష్టికి సమస్యలు..
● ఎఫ్‌ఎఫ్‌ఎస్‌లో సాంకేతిక సమస్యలు ● ఎరువుల బుకింగ్ కాక అవస్థలు ● పరిష్కారానికి చర్యలు: ధనసరి పుల్లయ్య జిల్లా వ్యవసాయాధికారి
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఎఫ్‌ఎఫ్‌ఎస్(ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) అమలులో సాంకతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఎరువుల బుకింగ్ ఆలస్యమవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బుకింగ్‌లో 20కి పైగా సమస్యలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ గుర్తించగా.. ప్రధానంగా ఫార్మర్ రిజిస్ట్రీలో ల్యాండ్ సింక్రనైజేషన్ కాకపోవటం, పోడు భూములకు సర్వే నంబర్ లేకపోవడం, మూతపడిన డీలర్ల వద్ద మిగిలిన స్టాక్ ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో డెడ్ స్టాక్‌గా చూపించటం, రిటైలర్ వద్ద స్టాక్ అయిపోయినా అదనపు క్యూఆర్ కోడ్‌లు జనరేట్ అవటం, ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ కావటం వలన మండల వ్యవసాయాధికారుల లాగిన్‌లో వివాదాస్పద భూములను ఆమోదించలేకపోవటం, ఆధార్ లింక్ లేకపోవటం, ల్యాండ్ ఇప్పటికే మ్యాప్ అయినట్లు చూపించడం, సర్వే నంబర్లలో తెలుగు అక్షర సఫిక్స్ ఉన్నప్పుడు బుకింగ్ నిలిచిపోవటం, మండల మ్యాపింగ్‌లో లోపాల కారణంగా స్టాక్ కేవలం 3–5 నిమిషాల్లో అయిపోయినట్లు చూపుతున్నాయి. ఇందులో కొన్ని..
●సత్తుపల్లి మండలం అయ్యగారిపేట రెవెన్యూ గ్రామం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీలో భూముల ల్యాండ్ సింక్రనైజేషన్ పూర్తి కాకపోవటం వలన రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
●ఎల్‌జీడీ కోడ్ మిస్‌మ్యాచ్ కారణంగా తల్లాడ మండలంలోని లక్ష్మీపురం గ్రామం పొరపాటున కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి మ్యాపింగ్ అయింది. ఇటువంటి సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఎరువులను నూతన యాప్ ద్వారా పొందటంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఎరువుల బుకింగ్‌లో యాప్‌లో ఎదురవుతున్న సమస్యలను ఎఫ్‌ఎఫ్‌ఎస్ బృందం దృష్టికి తీసుకెళ్లాం. మొదట్లో సాంకేతిక సమస్యలు రావడం సహజమే అయినా త్వరలోనే పరిష్కరిస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. సమస్య ఎదురైతే స్థానిక డీలర్లు, పీఏసీఎస్ సిబ్బంది లేదా సంబంధిత వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి


