ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
కారేపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కెరీర్ గైడెన్స్, ఉన్నత విద్యపై అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ప్రాంగణంలో పరిసరాలను పరిశీలించిన ఆయన విద్యార్థుల ప్రవేశాలు, వారి ఫలితాలు, భోజన సదుపాయాలు, వసతులు, ఉపాధ్యాయుల బోధన తీరుపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించి, వారికి ఇష్టమైన సబ్జెక్టులు, లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత పాఠశాలలోని లైబ్రరీ, మ్యూజిక్ రూమ్, ఆర్ట్స్ గ్యాలరీ, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు వంటి నైపుణ్యాలు ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాఠశాల నిర్వాహణ, విద్యార్థుల విద్యా ప్రగతి, మౌలిక వసతులు, సిబ్బంది, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఖమ్మం–రేలకాయలపల్లి ఆర్‌టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పాఠశాల ప్రహరీపై సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అదనపు విద్యుత్ లైన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని వివరించగా.. స్పందించిన కలెక్టర్ ఈ అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 9.57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 6 నుంచి 12వ తరగతి వరకు జరుగుతున్న విద్యాబోధనను విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్‌కుమార్, ఆర్‌ఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


