చివరికి గోదారే దిక్కు..! | - | Sakshi
Sakshi News home page

చివరికి గోదారే దిక్కు..!

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

ఐదెకరాలు బీడుగా పెట్టుకున్నా.. 500 ఎకరాలు ఎండినట్టే..

ఆయకట్టు రైతుల కన్నీరు.. మున్నీరు

గతంలో గోదావరి జలాలు అందించి.. ప్రస్తుతం నిలిపివేయడంతో ఆందోళన

మరోసారి వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు

ఈసారైనా సాగు పూర్తయ్యే వరకూ అందివ్వాలని డిమాండ్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కృష్ణా జలాలు రాకున్నా.. గోదావరి జలాలు వచ్చాయని ఆశపడి సాగులోకి దిగిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ నీటి విడుదలను నిలిపివేయడంతో సాగు, నాట్ల దశలో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయి. పర్యవసానంగా రైతులు కన్నీటి పర్యంతం అవుతూ నీటి విడుదల కోసం అధికారులను వేడుకుంటున్నారు. ప్రస్తుతం గోదావరి జలాలను ఏన్కూరు లింక్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేస్తున్నప్పటికీ అవి ఎంతకాలం విడుదలవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వైరా, లంకాసాగర్‌ ప్రాజెక్టుల ద్వారా అనధికారికంగానే గోదావరి జలలను సాగు కోసం వినియోగిస్తున్నారు. పూర్తిస్థాయిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

కరుణించని వరుణుడు..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాల కు తోడు.. ఇటీవల అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. బోర్లు, బావులతోపాటు జలాశయా ల పరిధిలో కూడా వరిసాగు ప్రారంభించారు. తుపాను తగ్గిన అనంతరం మళ్లీ ఎండలు యథాతథంగా మండుతున్నాయి. వర్షాల జాడ లేదు. కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో నారుమళ్లు పోసిన, నాట్లు వేసిన రైతులకు ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉంది. వచ్చేనెల ఇదే పరిస్థితి ఉంటే పంటలను రక్షించుకోవడానికి ఏం చేయాలనే దానిపై రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పంటలను కాపాడుకునేందుకు గోదావరి జలాలను విడుదల చేయాలని రైతులు అభ్యర్థిస్తున్నారు.

గత నెలలో విడుదల..

గత నెలలో ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరాయి. ప్రతి ఏటా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే కృష్ణా జలాలు ఈసారి జాడలేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు నుంచి గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టుకు తరలించారు. ఏన్కూరు లింక్‌ కెనాల్‌ ద్వారా వైరా రిజర్వాయర్‌లోకి నీరు వచ్చి చేరింది. అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు కోసం ఈ నీటిని వినియోగించారు. ఈ నీరు వైరా రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలోని రైతులకే కాకుండా.. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌ మండలాల్లోని లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందింది. ఈ నీటి విడుదలతో చాలాచోట్ల రైతులు వరి నాట్లు వేయడంతోపాటు నారుమళ్లు పోశారు. నీళ్లు అందుబాటులో ఉన్నాయని రైతులు సంతోషించే లోపు ఈ నీటి విడుదలను నిలిపివేశారు. ఈ కారణంగా అటు సాగు చేసిన పంటలతో పాటు నారుమళ్లు దెబ్బతిన్నాయి.

రైతుల ఆందోళనతో దిగివచ్చినా..

జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. ఇక సగానికి పైగా చెరువుల్లో 25 శాతం నీళ్లు కూడా లేవు. మరోవైపు రైతులు ఆశలు పెట్టుకున్న గోదావరి జలాలను నిలిపివేశారు. ప్రధానంగా వైరా రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో 20 వేల ఎకరాల్లో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లిఫ్ట్‌లు, మోటార్ల ద్వారా ఐదు వేల నుంచి పదివేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈ దశలో గోదావరి జలాల విడుదలను అధికారులు నిలిపివేశారు. నీటి లభ్యత లేకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. మరోసారి గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, రాజకీయ పార్టీల ఆధ్వర్యాన సోమవారం వైరా నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. తాగునీటికే ఈ నీటిని వినియోగించాలని ఉన్నతాధికారులు చెబుతున్న నేపథ్యాన అనధికారికంగా సాగు అవసరాలకే వినియోగిస్తున్నారు.

పూర్తిగా విడుదల చేయాల్సిందే..

సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు గోదావరి జలాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రైతులు అర్థిస్తున్నారు. కళ్లెదుట ఎండిపోతున్న పంటలను రక్షించుకునేందుకు అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశాలు లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా.. తమ పంటలు చేతికొచ్చే వరకు గోదావరి జలాలు విడుదల చేయాలని రైతాంగం అధికారులను కోరుతోంది. ఈ నీటితో వైరా, సత్తుపల్లి, మధిర మండలాల్లోని ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకుంటారు.

ఈ ఏడాది వర్షాలు కురిసే పరిస్థితి లేకపోవడంతో పాటు అధికారులు వైరా రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేస్తారో..? లేదో స్పష్టంగా చెప్పలేదు. ఈ కారణాలతో ఐదెకరాలను బీడుగానే ఉంచా. ప్రతి ఏడాది ఈ ఐదెకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పుడు నీళ్లు ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. నీరు ఇస్తే మళ్లీ సాగు చేస్తా.

– చావా మధు, రెబ్బవరం, వైరా మండలం

దాసాపురం గ్రామంలో వైరా ఏటిని అనుసంధానం చేసుకుని లిఫ్ట్‌ల ద్వారా రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 500 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. అధికారులు వైరా రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయకపోతే అవి ఎండిపోయినట్టే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంటలకు అవసరం మేరకు నీటిని విడుదల చేయాలి.

–ఐలూరి శ్రీనివాస్‌రెడ్డి, దాసాపురం, వైరా మండలం

నాట్ల దశలో సాగునీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement