చుంచుపల్లి: అటవీ, వన్యప్రాణులు, సహజ వనరుల సంరక్షణ కోసం పటిష్ట కార్యాచరణతో ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అధికారులు, సిబ్బందికి సూచించారు. భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ భీమానాయక్‌తో కలిసి మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్‌ఓలు,ఎఫ్‌డీఓలు, ఇతర అటవీ అధికా రులతో సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అక్రమవేట నివా రణ, అటవీ నేరాల నియంత్రణ, గస్తీ వ్యవస్థ, ముందస్తు సమాచార సేకరణ, వివిధ శాఖల సమన్వ యం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఫ్రంట్‌లైన్ సిబ్బంది భద్రత, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఎఫ్‌బీఓ నవీన్ మృతి ఘటన మరలా పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక గ్రామస్తులు, ప్రజలు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందస్తు సమాచారాన్ని సేకరించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించాలని, నిరంతర కమ్యూనికేషన్ కొనసాగించాలని సూచించారు. అవసరమైన చోట్ల అటవీ శాఖ–విద్యుత్ శాఖ సంయుక్త క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర విద్యుత్ లైన్లు గుర్తించిన ప్రాంతాల వారీగా వివరాలను నమోదు చేసి, తీసుకున్న చర్యలను క్రమం తప్పకుండా సమీక్షించాలని తెలిపారు.
కిన్నెరసాని డివిజన్‌లో పరిశీలన..
పీసీసీఎఫ్ వినయ్ కుమార్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ భీమా నాయక్‌తో కలిసి కిన్నెరసాని డీర్ పార్క్ ను సందర్శించి, డివిజన్‌లో చేపడుతున్న అటవీ సంరక్షణ, వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాలు, సందర్శకుల సౌకర్యాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. కిన్నెరసాని ప్రాంతంలోని సహజ వనరులు, అటవీ సంపద, వన్యప్రాణులను పరిరక్షిస్తూ డీర్‌పార్క్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఖమ్మం డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, పలువురు ఎఫ్‌డీఓలు, రేంజ్ ఆఫీసర్లు, అధికారులు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.


