దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి
● ఆపై పేదల ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తాం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించిన వారి నుంచి స్వాధీనం చేసుకుని, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్‌ను ఆదేశించారు. పల్లెగూడెంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించాక మంత్రి మాట్లాడారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం అవసరమైన భూములను సమీకరించి పేదలకు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, పల్లెగూడెంలో రూ.61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతుండగా, ఇప్పటికే సీసీ రోడ్లు, ఇతర పనులు పూర్తయ్యాయని తెలిపారు. జీపీ భవనాన్ని రెండు నెలల్లోనే నాణ్యతగా పూర్తి చేయడంపై ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందించారు. గ్రామస్తుల వినతితో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
31వరకు పింఛన్ దరఖాస్తు
అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు.
కూసుమంచి: దివ్యాంగులు లోపాలను చూసుకుని బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే అందరితో సమానంగా అభివృద్ధి చెందుతారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగులకు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మూడు చక్రాల మోటార్ సైకిళ్లను సీపీ సునీల్‌దత్‌తో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అనుకూలమైన రంగాల్లో రాణించాలని సూచించారు. డీడబ్ల్యూఓ ప్రమీల, ఆర్‌డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


