సమాచారం లేకుంటే ఏం ఉపయోగం? | - | Sakshi
Sakshi News home page

సమాచారం లేకుంటే ఏం ఉపయోగం?

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

అభివృద్ధి పనులు గడువులోగా

పూర్తి చేయాలి

‘దిశ’ సమావేశంలో ఎంపీ రఘురాంరెడ్డి

ఖమ్మంమయూరిసెంటర్‌: అధికారుల వద్ద శాఖల సమాచారం లేకుంటే ఉపయోగం ఏమిటని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎంపీ అధ్యక్షతన ‘దిశ’ కమిటీ సమావేశం నిర్వహించగా వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఈక్రమాన పరిశ్రమల శాఖ అధికారులు పీఎంఈజీపీ పథకంపై సమగ్ర సమాచారం చెప్పకపోవడంతో ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారమంతా ఆన్‌లైన్‌లో ఉందని, ఈ–ఫైల్‌ ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించగా, కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. జోక్యం చేసుకొని సాంకేతిక సమస్య వచ్చినా ఇబ్బంది పడకుండా ఆఫీస్‌ ఫైళ్లు కూడా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు ప్రయోజనం జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిధులు, అనుమతులకు సంబంధించి సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంచాయతీరాజ్‌ శాఖలో పనులు, వీఓ భవనాల నిర్మాణం, ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా తాగునీటి కోసం మంజూరైన పనులు, డీఎంఎఫ్‌టీ నిధుల వినియోగం, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల లోటుపాట్లపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, గ్యాస్‌ కనెక్షన్లకు అర్హత ఉన్న కుటుంబాల సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలన్నారు. అలాగే, ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నీ పరిష్కరించాలని సూచించారు.

ఆకస్మిక తనిఖీలు చేయండి

జిల్లాలోని అన్ని గురుకులాలు, వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎంపీ రఘురాంరెడ్డి ఆదేశించారు. దమ్మపేటలో గురుకులాన్ని తాను తనిఖీ చేయగా అనేక లోపాలు కనిపించాయని తెలిపారు. ఈమేరకు విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, సన్నబియ్యం పంపిణీని నిశితంగా పర్యవేక్షించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలు, తాగునీటి పనులు, ఖమ్మం రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ సౌకర్యం, అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ వరంగల్‌ – ఖమ్మం హైవే పనులు షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతున్నాయని వెల్లడించడమే కాక కొత్త విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు వివరాలు వెల్లడించారు. కాగా, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లో డంపింగ్‌యార్డ్‌ సమస్య ఉందని చైర్మన్లు చెప్పగా పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు ఇవ్వాలని, వీఓ భవనాల బిల్లులు మంజూరు చేయాలని, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని వెంకటాయపాలెం సర్పంచ్‌ కోరారు. ఈసమావేశంలో సీపీ సునీల్‌ దత్‌, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement