ప్రాజెక్ట్‌లు త్వరితగతిన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్‌లు త్వరితగతిన పూర్తి చేయాలి

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

అశ్వాపురం/ ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్‌, సీతమ్మ సాగర్‌ బ్యారేజీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీ బృందం అశ్వాపురం మండలంలో సీతమ్మసాగర్‌ బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు కెనాల్‌, బీజీ కొత్తూరు వద్ద పంప్‌హౌస్‌, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం, ములకలపల్లిలోని కమలాపురంలో పంపుహౌస్‌లను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణంలో జాప్యంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీతారామ, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌లపై వాస్తవ పరిస్థితులను రైతాంగానికి వివరించేందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నాయకుల బృందం ఈ పర్యటన చేపట్టిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఎనిమిదేళ్లు కావస్తున్నా ప్రాజెక్ట్‌ పూర్తిచేసి ఇప్పటికీ సాగునీరు ఇవ్వకపోవడం రైతులను చిన్నచూపు చూడడమేనన్నారు. దుమ్ముగూడెం రాజీవ్‌ప్రాజెక్ట్‌కు డిజైన్ల మీద డిజైన్లు మారాయి కానీ ప్రాజెక్ట్‌ నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదన్నారు. అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం, అమ్మగారిపల్లి ప్రాంతాల ప్రజలు ఇప్పటికే పలుమార్లు భూములు కోల్పోయారని, ఇప్పటికీ నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. ప్రాజెక్ట్‌ కోసం భూములు కోల్పోయిన ప్రతీ నిర్వాసితుడికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ములకలపల్లి మండలంలోని ప్రధాన చెరువులకు ఈ సంవత్సరమే నీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టు పనులు, కాలువల నిర్మాణం, భూసేకరణ, నష్టపరిహారం తదితర అంశాల్లో అనేక అనుమానాలు, అవకతవకల ఆరోపణలు వస్తున్నాయని వాటిపై పారదర్శకంగా సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాచర్ల భారతి, అన్నవరపుకనకయ్య, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్‌, విక్రమ్‌, నాయకులు రేపాకుల శ్రీనివాస్‌, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, లిక్కి బాలరాజు, బండి పద్మ, ఎర్ర శ్రీనివాసరావు, మడిపల్లి గోపాలరావు, మెరుగు సత్యనారాయణ, యలమంచి వంశీకృష్ణ కె.పుల్లయ్య, రేపాకుల శ్రీను, బాలరాజు, వెంకన్న, వంశీ, వెంకటేశ్వర్లు, రాంబాబు, రామూర్తి, ఆదినారాయణ, సర్పంచ్‌ వగ్గేల రాధ తదితరులు పాల్గొన్నారు.

సీతారామ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన

సీపీఎం ఉమ్మడి జిల్లా బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement