జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువ ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు వచ్చేనెల 16వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
మహిళలే టాప్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తికావడంతో జిల్లాలో ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈమేరకు మొత్తం 10,85,927 మంది ఉన్నట్లు తేలగా, ‘సర్’కు ముందుతో పోలిస్తే 1,57,854 మంది తగ్గారు. ఇందులో మృతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే కాక ఇతర కారణాలతో ఇంకొందరికి స్థానం దక్కలేదు. కాగా, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఖమ్మం అత్యధిక ఓటర్లతో మొదటి స్థానాన నిలవగా, వైరా నియోజకవర్గం తక్కువ ఓటర్లతో చివరి స్థానంలో ఉంది.
12.43 లక్షల నుంచి 10.85 లక్షలకు..
‘సర్’ ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్లు తగ్గారు. తొలుత 12,43,781 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 10,85,927 మందికే స్థానం దక్కడంతో 1,57,854 మంది పేర్లు తొలగించినట్లయింది. వీరిలో అత్యధికంగా 1,01,549 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తేల్చారు. ఇక మృతులు 33,380 మంది ఉండగా, రెండేసి ఓట్లు కలిగిన వారు 11,004 మంది, ఎన్యుమరేషన్ ఫారం తీసుకున్నా తిరిగి ఇవ్వని వారు 11,371 మంది, ఇతర కారణాలతో ఫారాలు అందని 550 మంది పేర్లు తొలగించిన జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 80,663 ఓట్లు తగ్గగా, ఆ తర్వాత మధిరలో 20,638 ఓట్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 20,244, అలాగే పాలేరులో 19,156, వైరాలో 17,153 ఓట్లు తగ్గాయి.
వచ్చేనెల 16 వరకు అభ్యంతరాలు
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను వచ్చే నెల 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనుండగా, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడంతో పాటు పరిష్కారానికి అక్టోబర్ 10వరకు గడువు విధించారు. ఇదంతా పూర్తయ్యాక అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. కాగా, ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్‌లు, ఈఆర్‌ఓ కార్యాలయాల్లో ప్రదర్శించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటర్ల జాబితా అందిస్తున్నారు. జాబితాలో పేర్లు తొలగిపోవడం, ఏమైనా తప్పులు ఉన్నా, మ్యాపింగ్ కాకున్నా ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించి నోటీసులు జారీ చేస్తారు. బీఎల్‌ఓలు, ఈఆర్వోలు వీటిని స్వీకరించి విచారణ చేస్తారు.
ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేయొచ్చు. ఈ అభ్యంతరాలను పరిష్కరించడమే కాక ముసాయిదా జాబితాలో తప్పులు(అనామలిస్), మ్యాపింగ్ కాని ఎన్యూమరేషన్ ఫారమ్‌లకు సంబంధించి వ్యక్తులకు నోటీసులు జారీ చేసి సవరణలకు అవకాశం ఇచ్చాం. బీఎల్‌ఓలు, ఈఆర్వోలకు అభ్యంతరాలు ఇవ్వాలి. జిల్లాలో ఓటర్ల నమోదు, మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాం. – దివాకర టీఎస్, కలెక్టర్
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 1,29,761 మంది, పాలేరులో 1,17,319, సత్తుపల్లిలో 1,16,253, మధిరలో 1,05,796, వైరాలో 91,844 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత తుది జాబితాకు వచ్చేసరికి తక్కువ సంఖ్యలో మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.


