సాగర్‌ ఆయకట్టులో పంటలను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ ఆయకట్టులో పంటలను కాపాడాలి

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల

ఖమ్మంఅర్బన్‌: సాగర్‌ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న గోదావరి జలాలను జాగ్రత్తగా వినియోగించి ఆయకట్టు చివరి భూముల వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన కాల్వలు, ఉప కాల్వలను నిరంతరం పరిశీలిస్తూ గండ్లు, లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయించాలని తెలిపారు. ఈనెల 15న అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మోటార్లను ప్రారంభించి రాజీవ్‌ లింక్‌ కెనాల్‌కు గోదావరి జలాలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా సాగర్‌ ఆయకట్టు పరిధిలోని ప్రధాన చెరువులకు నీరు చేరుతున్నందున రైతులు కూడా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. గోదావరి జలాల విడుదలకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రైతుల తరఫున మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.

రేక్‌ పాయింట్‌కు

కాంప్లెక్స్‌ ఎరువులు

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు సోమవారం ఫ్యాక్ట్‌ కంపెనీకి చెందిన కాంప్లెక్స్‌ ఎరువులు చేరాయి. ఇందులో అమ్మోనియం సల్ఫేట్‌ 319.250 మెట్రిక్‌ టన్నులు, 20.20.00.13 ఎరువులు 1.018.200 మె.టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు కేటాయించడమే కాక కొంత బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.

నీటి గుంతలతో

భూగర్భ జలాల రక్షణ

చింతకాని: ఎల్‌నినో ప్రఽభావంతో వర్షాభావ పరిస్థితుల నెలకొన్నందున రైతులు తమ పొలాల్లో నీటి గుంతలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత సూచించారు. మండలంలోని బస్వాపురంలో పలువురు రైతుల పొలాల్లో నీటి గుంతల పనులను సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పొలాల్లో నీటి గుంతల ఏర్పాటుకు అవకాశముందని తెలిపారు. వీటి ద్వారా భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆవుల నర్సింహారావు, జిల్లా పంచాయతీ అధికారి వినోద్‌, వివిధ శాఖల అధికారులు శిరీష, శ్రీనివాస్‌, విజయలక్ష్మీ, చుంచు శ్రీనివాసరావు, కోటయ్య, రఘు, కార్తీక్‌, రామకృష్ణ, నాయకుడు కన్నెబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.

మహాబలిపురం నుంచి నాచారానికి విగ్రహాలు

ఏన్కూరు: ఏన్కూరు మండలం నాచారంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవారి ఏకశిలా విగ్రహాలను ప్రతిష్ఠించున్నారు. ఈమేరకు తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో సిద్ధం చేయించిన విగ్రహాలను ప్రత్యేక వాహనంలో సోమవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో కోలాట నృత్యాలతో స్వాగతం పలకగా, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌, మొగిలి శ్రీనివాసరెడ్డి తదితరులు వారితో పాదం కలిపారు. అనంతరం ఏన్కూరు, రేపల్లెవాడ, నాచారం మీదుగా నాచారం దేవాలయం వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆలయంలో అన్నదానం ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement