కారేపల్లి: ఇటీవల మృతి చెందిన ఎఫ్‌బీఓ నవీన్ కుటుంబానికి అన్నిరకాలుగా అండగా నిలుస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) వినయ్‌కుమార్ భరోసా ఇచ్చారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులను తాకడంతో ఇటీవల నవీన్ మృతి చెందిన విషయం విదితమే. ఆయన స్వగ్రామమైన కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు సోమవారం వచ్చిన పీసీసీఎఫ్ తొలుత నవీన్ చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. నవీన్ కుటుంబానికి శాఖాపరంగా రూ.35లక్షలు, ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి సాయంతో పాటు ఎంటెక్ చదివిన నవీన్ భార్య ప్రమీలకు ఉద్యోగం, 500 గజాల స్థలం త్వరగా అందేలా చూస్తామని చెప్పారు. విద్యుత్ తీగలు అమర్చి నవీన్ మృతికి కారణమైన వారిపై కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు ప్రయత్నిస్తామని పీసీసీఎఫ్ తెలిపారు.
విద్యుత్ శాఖ నిర్లిప్తత
వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చే సమయాన సరఫరా ట్రిప్ అవుతుందని.. దీన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు గుర్తించే అవకాశముందని పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అలా గుర్తించకపోవడం, విద్యుత్ ఉద్యోగుల నిర్లిప్తతతో తప్పిదం జరిగిందన్నారు. ఇకపై తనిఖీలకు వెళ్లే సమయాన ఉద్యోగులు జాగ్రత్తలు పాటించడం, మెటల్ డిక్టేటర్ల వాడకంపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఆయుధాలు అందించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని పీపీసీఎఫ్ చెప్పారు. కాగా, పీసీసీఎఫ్‌తో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ ఫోన్‌లో మాట్లాడి నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. భద్రాద్రి జోన్ సీసీఎఫ్ బీమానాయక్, ఖమ్మం డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, ఎఫ్‌డీఓ భవానీశంకర్, నవీన్ తల్లిదండ్రులు బూలి – దేవ్లానాయక్, సోదరుడు లెనిన్ ఉన్నారు.
డీఎఫ్‌ఓ కార్యాలయంలో పీసీసీఎఫ్
ఖమ్మంవ్యవసాయం: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) వినయ్‌కుమార్ సోమవారం ఖమ్మం జిల్లా అటవీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం నవీన్ కుటుంబాన్ని పరామర్శించాక కొత్తగూడెం వెళ్లారు. మంగళవారం అధికారులతో పీసీసీఎస్ సమావేశమవుతారని తెలిసింది.
పరామర్శించిన పీసీసీఎఫ్ వినయ్‌కుమార్


