ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కమిటీ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్, రాయల చంద్రశేఖర్ ఆత్మహత్యను ఆసరాగా చేసుకుని తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకత్వం బహిరంగ విచారణకు సిద్ధం కావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల చంద్రశేఖర్ జీవిత సహచరి విమల రాసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఎన్‌డీ నేతలు మాస్‌లైన్ పార్టీపై బురదజల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. ఆయన మృతిపై రాద్ధాంతం చేయకుండా, మధ్యవర్తిని పెట్టుకుని బహిరంగ విచారణకు రావాలని సూచించారు. గతంలో ఉమ్మడి న్యూడెమోక్రసీలో ఉన్నప్పుడు చంద్రశేఖర్‌ను ఇల్లెందు ప్రాంతానికి రానివ్వకుండా ఆంక్షలు విధించిన వారే ఇప్పుడు తమపై విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటం మరచి, మాస్‌లైన్ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, ఆవుల వెంకటేశ్వర్లు, బందెల వెంకయ్య, ఆర్.శివలింగం, కమ్మకొమ్మటి నాగేశ్వరరావు, టి.ఝాన్సీ, కె.శ్రీనివాస్, తిమ్మిడి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.


