● నల్లతుమ్మ స్థానంలో సండ్ర కలప తరలింపు ● ఇద్దరిని అరెస్ట్ చేసిన ఖమ్మం సీసీఎస్ పోలీసులు
ఖమ్మంక్రైం: కలప తరలింపు కోసం అటవీ శాఖ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఖమ్మం సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ నుంచి అందిన ఫిర్యాదుతో ఏసీపీ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ గౌడ్ నేతృత్వాన దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఈమేరకు ఏసీపీ ఆదివారం వెల్లడించిన వివరాలు..
తుమ్మ స్థానంలో సండ్ర
నల్ల తుమ్మ కర్ర సరఫరా పేరిట అటవీ అధికారులు అనుమతి పత్రాలు జారీ చేశారు. ఈక్రమాన సూర్యాపేట జిల్లా మోతె మండలం గోప్యాతండాకు చెందిన కర్ర వ్యాపారి కొర్ర శివ నేతృత్వాన మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లి, కురవి, సీరోలు, కాంపెల్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లో సండ్ర చెట్లను నరికించారు. ఆపై నల్ల తుమ్మ పేరుతో జారీ అయిన అనుమతి పత్రాలపై సండ్ర కర్రగా మార్చారు. ఈ పత్రాల ఆధారంగా కలపను విజయవాడకు చెందిన రాధేశ్యామ్‌కు విక్రయించాడు. ఆయన మధ్యప్రదేశ్‌లోని జాబువా పట్టణం ఏఎం ఎంటర్‌ప్రైజెస్ యజమాని అబ్దుల్ రహేమాన్‌కు సరఫరా చేసినట్లు తెలిసింది. సండ్ర కర్రను మధ్యప్రదేశ్‌లోని పాన్ మసాలా తయారీలో వాడుతుండడంతో సుమారు తొమ్మిది లారీల కర్రను సరఫరా చేశాడని గుర్తించారు. ఈమేరకు శివ, రాధేశ్యామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. ఇందులో శివపై నిందితుల్లో గతంలోనూ వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. అయితే, కేసు విచారణ కొనసాగుతుండగా, ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా, కేసులో విచారణలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ సర్వర్, ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్‌ఐ ఎ.వంశీకృష్ణ, సిబ్బంది శ్రీనివాస్, హరి, జానీ, నరింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్ సిబ్బందిని సీపీ సునీల్‌దత్ అభిందించారు.


