వేగం తక్కువ | - | Sakshi
Sakshi News home page

వేగం తక్కువ

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

ప్రణాళిక లేకనే

ఈ నెల 8 నుంచి మొదలైన గోదావరి ఎత్తిపోతలు పది రోజుల్లో ఎత్తిపోసింది ఒక టీఎంసీనే పూర్తికానీ బెల్‌మౌత్‌, హెడ్‌ రెగ్యులేటరీ పనులు

లక్ష్యం ఎక్కువ..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్‌నినో పరిస్థితుల వల్ల కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలు రాక అంటూ జరుగుతున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతన కుదరడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్షా యాభై వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమయ్యే పనిలా లేదు. దీంతో ప్రస్తుత ఎత్తిపోతలు మరో ట్రయల్‌రన్‌గా మారుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణాకు గోదావరి భరోసా..

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా కృష్ణా ఆయకట్టు కింద ఉన్న లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉజ్జాయింపు లెక్కల ప్రకారం ఒక టీఎంసీ (11,574 క్యూసెక్కులు) నీటితో పది వేల ఎకరాలు సాగు అవుతాయి. ఈ లెక్కన లక్షా యాభై వేల ఎకరాలకు సాగు నీరు అందాలంటే, సరఫరా నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే 15 టీఎంసీల నీరు అవసరం. సీతారామ ప్రధాన కాలువ ఎత్తిపోతల సామర్థ్యం రోజుకు 9,000 క్యూసెక్కులు (0.78 టీఎంసీలు). గరిష్ట సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తే 20 రోజుల్లో పదిహేను టీఎంసీల నీటిని ఎత్తిపోయడం పెద్ద విషయం కాదు.

లక్ష్యం చేరుకునేనా

గోదావరి జలాలను సీతారామ ట్రంక్‌ కెనాల్‌– రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా ఈ నెల 8 నుంచి ఎత్తిపోస్తున్నారు. రోజుకు 1,500 క్యూసెక్యుల వంతున ఎత్తిపోతలు జరుగుతున్నాయి. దీంతో గడిచిన పది రోజుల్లో కేవలం ఒక టీఎంసీ నీటినే ఎత్తిపోయగలిగారు. ఈ క్రమంలో 15 టీఎంసీల నీరు ఎత్తిపోయాలంటే ఇంకో ఐదు నెలల సమయం పడుతుంది. కనీసం పది టీఎంసీలు ఎత్తిపోయాలన్నా మూడు నెలలు అవుతుంది. ఈలోగా ఖరీఫ్‌ సీజన్‌లో విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు అన్ని రోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం ఉండేది అనుమానమే. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదముంది.

లోపం ఎక్కడ?

కాటన్‌ ఆనకట్ట దగ్గర నీటిమట్టం 47.50 అడుగులకు చేరుకుంటే పూర్తి స్థాయిలో అలుగు పడుతుంది. ఆ సమయంలో 45 అడుగుల నీటి మట్టం నుంచి గోదావరి నీటిని సీతారామ ప్రధాన కాలువకు తరలించుకోవచ్చు. ఇలా గోదావరి నుంచి నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ను బెల్‌మౌత్‌ అని, వచ్చిన నీరు ప్రధాన కాలువ, పంపుహౌస్‌లను ముంచెత్తకుండా వరదను క్రమబద్ధీకరించేందుకు హెడ్‌ రెగ్యులేటరీలు అవసరం పడుతాయి. సీతమ్మసాగర్‌ బరాజ్‌ ప్యాకేజీలో బెల్‌మౌత్‌, హెడ్‌ రెగ్యులేటరీల నిర్మాణాలు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతులు రాకపోవడంతో బరాజ్‌తో పాటు బెల్‌మౌత్‌, హెడ్‌రెగ్యులేటరీల నిర్మాణ పనులు ఆగిపోయాయి.

న్యాయపరమైన చిక్కులతో బరాజ్‌ పనులు ఆగిపోవడం, సీతారామపై పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం రాకపోవడం వల్ల ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుని కొత్తదైన సీతమ్మసాగర్‌తో సంబంధం లేకుండా పాతదైన కాటన్‌ ఆనకట్ట ద్వారా ఎత్తిపోతలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా యుద్ధప్రతిపాదికన రాజీవ్‌ ్‌ లింక్‌ కెనాల్‌, పంపు హౌస్‌లకు విద్యుత్‌ కనెక్షన్లు అందించింది. ఆ సమయంలోనే గోదావరి నుంచి నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ (బెల్‌మౌత్‌), హెడ్‌రెగ్యులేటరీ పనులను సైతం చేయాల్సి ఉంది. ఈ రెండు పనులను 2024లో మొదలు పెట్టారు. కానీ, నేటికీ పూర్తికాలేదు. ఫలితంగా గోదావరి నుంచి ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం ఎక్కువ మొత్తంలో నీరు తీసుకునే వీలు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి.

కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement