● ఆ ఘనత దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ● మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి/వేంసూరు: ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ప్రాజెక్టుకు పునాది వేసింది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు మండలం మర్లపాడులో పార్టీ బీఎల్‌ఏలతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాక రూ.19 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణం, మోటార్లు బిగించడం అంతా బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు పూర్తికాగా, ఇప్పుడు చిన్న కాల్వ తీసి, అంతా తమ ఘనతేనని కాంగ్రెస్ మంత్రులు చెప్పుకోవడం తగదన్నారు. ఇటీవల సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండున్నరేళ్లల్లో రూ.వేయి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడమే బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన పనుల విలువను తెలియచేస్తోందన్నారు. కాగా, జిల్లాలో ఒక మంత్రికి పేరు వస్తుందని మిగిలిన వారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకొచ్చి హడావుడి చేశారని విమర్శించారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా దుష్ప్రచారం మానుకోవాని సండ్ర సూచించారు.
అవసరమైతే రక్తం ఇస్తాం
సాగు అవసరాలకు నీరు విడుదల చేయాలని తాము కోరితే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రక్తం పోస్తామని మాట్లాడడం గర్హనీయమని సండ్ర పేర్కొన్నారు. ఒకవేళ సీఎంకు అవసరమైతే తమ కార్యకర్తల రక్తం పంపించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా, కేసీఆర్ కుటుంబంపై సీఎం మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టిన విషయం రైతులకు తెలుసునని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా అర్హులు ఓట్లు కోల్పోకుండా పార్టీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సమావేశాల్లో నాయకులు కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎస్‌కే రఫీ, మల్లూరు అంకమరాజు, ఎస్‌కే చాంద్‌పాషా, అమరవరపు కృష్ణారావు, దొడ్డా శంకర్‌రావు, ఎండీ అయూబ్‌పాషా, కోటగిరి వెంకటరావు, పాలా వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, దొడ్డ చెన్నకేశవరెడ్డి, గండ్ర సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


