ఖమ్మంక్రైం: గంజాయి రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఖమ్మంలోని కొత్త, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్‌తో తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. అలాగే, నార్కోటిక్ జాగిలం సాయంతో పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు, విద్యాసంస్థల పరిసరాల్లో తనిఖీలు చేపడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకాన్ని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎవరికై నా సమాచారం తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా ఈగల్‌ఫోర్స్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ ఉదయ్‌కుమార్, ఎస్‌ఐ కిరణ్ పాల్గొన్నారు.
నలుగురు సబ్ ఇంజనీర్లకు పదోన్నతి, బదిలీ
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో నలుగురు సబ్ ఇంజనీర్లకు ఇన్‌చార్జ్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఏఈ)గా పదోన్నతి కల్పిస్తూ సీఎండీ వర్నాటి వరుణ్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలాయపాలెం సెక్షన్ సబ్ ఇంజనీర్ సీహెచ్ ఆదినారాయణను ఏఏఈగా పదోన్నతి కల్పించి కొణిజర్ల సెక్షన్‌లో నియమించారు. ముదిగొండ మండలం పమ్మి సెక్షన్ సబ్ ఇంజనీర్ ఆర్.నాగేశ్వరరావుకు పదోన్నతి కల్పించి వైరా సెక్షన్‌కు, ఖమ్మం ఎంఆర్‌టీ డివిజన్ సబ్ ఇంజనీర్ కొరివి వెంకటరామకృష్ణ భరద్వాజ్‌కు పదోన్నతి కల్పించి కొణిజర్ల మండలం పెద్ద గోపతి సెక్షన్‌కు, కూసుమంచి సెక్షన్‌లో సబ్ ఇంజనీర్ జి.శ్రీశైలంకు పదోన్నతి కల్పించి కారేపల్లి సెక్షన్‌కు బదిలీ చేశారు. అలాగే, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఖమ్మం ఎంఆర్‌టీ డివిజన్ ఏఈ అలేఖ్యను ఖమ్మం డివిజన్ కార్యాలయం టెక్నికల్ ఏఈగా నియమించారు.
వసతిగృహాల్లో
అన్ని సౌకర్యాలు
వేంసూరు: విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం అన్ని వసతులు సమకూరుస్తోందని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి తెలిపారు. వేంసూరులోని బాలుర వసతిగృహాన్ని శుక్రవారం రాత్రి ఆమె తనిఖీ చేశారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయంతో పాటు భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
మెడికల్ బోర్డుకు
92 మంది హాజరు
రుద్రంపూర్: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన మెడికల్ బోర్డుకు యాజమాన్యం 120 మంది కార్మికులను పిలవగా 92 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. శుక్రవారం ప్రీ బోర్డ్‌లో వైద్య పరీక్షలు పూర్తికాగా, శనివారం ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా శనివారం కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు అన్‌ఫిట్ చేయనున్నారు. అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు యాజమాన్యం ఉద్యోగ అవకాశం కల్పించనుంది.
అనుమతి లేని మందులు సీజ్
ఏన్కూరు: అనుమతి లేకుండా విక్రయిస్తున్న మందులను డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌రెడ్డి సీజ్‌చేశారు. మండలంలోని బురద రాఘవాపురంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకండా విక్రయిస్తున్నట్లు తేలడంతో రూ.10 వేల విలువైన మందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు.


