● సమగ్ర భూసర్వేతో నష్టం జరగదు ● కాకరవాయిలో పర్యటించిన కలెక్టర్ దివాకర
తిరుమలాయపాలెం: సమగ్ర భూసర్వేలో వచ్చిన నోటీసులు చూసి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అందులో వివరాలు సమగ్రంగా లేకపోతే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. తిరుమలా యపాలెం మండలం కాకరవాయిలో సమగ్ర భూ సర్వే పూర్తయిన నేపథ్యాన శుక్రవారం ఆయన గ్రామరైతులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే ద్వారా ఎవరికీ నష్టం జరగదని, భూమి కచ్చితంగా రికార్డుల్లో నమోదు అవుతుందని తెలిపారు. ఇంకా ఎవరికై నా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా, గ్రామంలో వరి నారుమడిని చూసిన కలెక్టర్.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన వరికి బదులు ప్రత్యా మ్నాయ పంటలు సాగుచేయాలని తెలిపారు. ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో బీరోలు సమీపాన జరుగుతున్న సొరంగం పనులను కలెక్టర్ దివాకర పరిశీలించారు. పనుల్లో వేగంపెంచి, త్వరగా మున్నేరు నీటిని పాలేరుకు తరలించేలా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమా ల్లో ఆర్డీఓ శ్రీనివాస్, ఈఈలు రమణ, శ్రీనివాసరెడ్డి, డీఈలు చంద్రమోహన్, బాణాల రమేశ్‌రెడ్డి, తహసీల్దార్ లూథర్ విల్సన్, ఉద్యోగులు సుధీర్, లక్ష్మణ్, సతీశ్‌రెడ్డి సర్పంచ్ గూడూరు ఉపేందర్ పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలే మేలు
కూసుమంచి: ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వరి, పత్తి, మిర్చికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కూసుమంచి మండలం పోచారంలో పర్యటించిన ఆయన ఇప్పటివరకు పంటల సాగు, సాగునీటి వసతి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి సాధ్యమైనంత తగ్గించేలా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో యాప్ ర్వారా యూరియా పంపిణీ సక్రమంగా జరుగుతోందని, రైతులకు సమస్యలు వస్తే అధికారులను సంప్రదించాలని తెలిపారు. కలెక్టర్ వెళ్లే మార్గంలో ఓ రైతు వరినాట్లు వేస్తుండగా వరికి బదులు ఇతర పంటలు ఎంచుకోవాలని చెప్పారు. సర్పంచ్ సల్వాది గురుమూర్తి, తహసీల్దార్ సైదులు, ఏఓ వాణి, ఉద్యోగులు రాము, రవి, జానీబాబా పాల్గొన్నారు.
నిబంధనల మేరకు పశువుల కొనుగోలు
ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీ పథకం అమలులో వ్యయాలను నియంత్రించడమే కాక నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఇందిరా మహిళా డెయిరీ పథకంపై సమీక్షించారు. లబ్ధిదారుల జాబితా ఖరారైన వెంటనే కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పాడి పశువులు కొనుగోలు చేయించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో లబ్ధిదారుల ఆమోదమే కీలకమని చెప్పారు. ప్రతీ వారం 25 మంది లబ్ధిదారులకు 50 పశువులను కొనుగోలు చేసేలా సిద్ధం కావాలన్నారు. ఇందుకోసం ప్రతీ మండలంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్‌కుమార్, డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎండీ ముజాహిద్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి బి.పురంధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయంపై విస్తృత అవగాహన
ఖమ్మంవ్యవసాయం: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలే సాగు చేసేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుంవర్థక తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. తక్కువ వర్షపాతం నమోదుతో భూగర్భ జలాలు తగ్గుతున్నందున గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణాన్ని కనీసం 25 శాతం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీ ఏఈఓ తన పరిధిలో కనీసం 50 ఎకరాల్లో కూరగాయలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ, పశు సంవర్థక, సహకార, ఉద్యాన శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, బి.పురంధర్, గంగాధర్, అనిత తదితరులు పాల్గొన్నారు.


