రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Jul 17 2026 12:41 AM | Updated on Jul 17 2026 12:41 AM

కల్లూరురూరల్‌: కల్లూరు ఎన్నెస్పీ క్రాస్‌ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మెరుగు గోపి(25) బుధవారం అర్ధరాత్రి చేపల చెరువు వద్దకు వెళ్లి తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమాన ఎన్నెస్పీ క్రాస్‌రోడ్డులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్ట గా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాదం అనంతరం లారీని అక్కడే నిలపగా గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో లారీని స్టేషన్‌కు తరలించి, గోపి తండ్రి వెంకటస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

బస్సు ఢీకొని ఉపాధ్యాయురాలు...

ఖమ్మంక్రైం: ఆర్‌టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఖమ్మం న్యూఇరా స్కూల్‌ ఉపాధ్యాయురాలు షేక్‌ రెహానా(35) రోజులాగే గురువారం అజీజ్‌ గల్లీ నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరింది. ఈమేరకు కాంగ్రెస్‌ కార్యాలయం సమీపాన పాత బస్టాండ్‌ నుంచి బోనకల్‌ వెళ్లే ఆర్టీ బస్సు ఢీకొట్టింది. ఈ సమయాన డ్రైవర్‌ లోయ గురవయ్య అతి వేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపినట్లు తెలిసింది. ఈమేరకు రెహానా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త అజీముద్దీన్‌ కేఎంసీలో పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటివరకు కుటుంబంతో గడిపిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు.

రైలు నుంచి జారిపడి యువకుడు...

కేసముద్రం: వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడిన ఓ యువకుడు మృతి చెందాడు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలు.... ఖమ్మం ప్రకాష్‌నగర్‌కు చెందిన చెక్కల మణికంఠ(25) అదే ప్రాంతానికి చెందిన బండారి జగదీష్‌, కళ్యాణ్‌కుమార్‌, కోరెడ్డి లక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని చుక్కగూడలో కూలి పనులకు వెళ్లాడు. ఆ పనులకు సంబంధించి నగదు కోసం వారంతా గురువారం హైదరాబాద్‌ వెళ్లే ఈస్ట్‌కోస్ట్‌ రైలులో బయలుదేరారు. రైలు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం – ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఉండగా మణికంఠ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు జీఆర్పీ సిబ్బంది మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించికుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

చోరీ కేసులో మూడేళ్ల జైలు శిక్ష

ఖమ్మం లీగల్‌: చోరీ కేసులో ఖమ్మం పాండురంగాపురానికి చెందిన ఈదర బోయిన సుమన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్‌ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం జూబ్లీపురకు చెందిన పెనుగొండ లక్ష్మీకాంతం ఈ ఏడాది మే 4న రాత్రి 9–30 షాపు నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఎదురుగా వచ్చి మెడలోని రూ.3.60లక్షల విలువైన నానుతాడు లాక్కొని పారిపోయాడు. ఘటనపై ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సుమన్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆయనను అరెస్టు చేసి కోర్టులో చార్జి షీటు దాఖలు చేయగా విచారణ అనంతరం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

13 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

ముదిగొండ: మండలంలో ని పెద్దమండవ, గంధసిరి మున్నేటి నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో గురువారం ముదిగొండ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్‌ఐ అశోక్‌, సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. గంధసిరి మున్నేరు నుంచి ఇసుక తరలించే నాలుగు, పెద్దమండవ మున్నేరు నుంచి ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను సీజ్‌ చేసి డ్రైవరుల, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement