ఖమ్మంమయూరిసెంటర్: సమసమాజ స్థాపన కోసం రాయల చంద్రశేఖర్ స్ఫూర్తితో యువత, ప్రజలు పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కమిటీ నాయకులు కే.జీ.రామచందర్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగయ్య అధ్యక్షతన జరిగిన రాయల రెండో వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న దోపిడీ, అవినీతి, అక్రమాలు, నిరుద్యోగానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలు అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పుష్కరకాలం గడిచినా పెట్టుబడిదారీ వర్గాల దోపిడీపై ప్రధాని నోరు మెదపడం లేదని ఆరోపించారు. కాగా, రాయల చంద్రశేఖర్ అజ్ఞాత జీవితంలో ప్రతిఘటన పోరాట యోధుడిగా విప్లవ ప్రస్తానాన్ని కొనసాగించారని తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె.రమ, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు చంద్ర అరుణ, పాయం చిన్న చంద్రన్న తదితరులు మాట్లాడుతూ రాయల పార్టీ చేస్తున్న విప్లవ కార్యాచరణ సరైన ఫలితాలను ఇస్తుందా లేదా అని నిరంతరం సృజన శీలంగా ఆలోచించేవారని తెలిపారు. నాయకులు ముద్దా బిక్షం, నాయని రాజు, కొత్తపల్లి రవి, ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, జి రామయ్య, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, రేపాకుల శివలింగం, టి.ఝాన్సీ తదితరులతో పాటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు గడ్డం లక్ష్మణ్, యోగానందం, కంకణాల శ్రీనివాస్, ప్రభు, పేరాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మాస్‌లైన్ కేంద్ర నాయకుడు
కే.జీ.రామచందర్


