ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటల నుంచి కూసుమంచి మండలం మల్లాయిగూడెం, కోక్యాతండా, అగ్రహారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనండగా, పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సాయంత్రం 4గంటల నుంచి నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, కోనాయిగూడెం, సదాశివపురం, అనాసాగరం, గువ్వలగూడెం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను మంత్రి ప్రారంభించనున్నారు. కాగా, కోనాయిగూడెంలో నందిగామ బ్రాంచి కెనాల్‌పై నిర్మించిన వంతెనను మంత్రి ప్రారంభించనుండగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవింరావు, నాయకులు పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేష్ శుక్రవారం పరిశీలించారు.
రైతులు అప్రమత్తంగా
ఉండాలి
సత్తుపల్లిరూరల్: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు పంటల సాగులో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. తెలిపారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సాగవుతున్న పంటలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం కిష్టారం సొసైటీ కార్యాలయంలో జరిగిన సదస్సులో డీఏఓ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురుస్తాయనే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు బోర్లు, బావుల కింద కూడా వరి సాగు తగ్గించి పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగులు, నువ్వులు, ఉలవ సాగు చేయాలని సూచించారు. లేనిపక్షంలో భూగర్భ జలాలు మరింత తగ్గి తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. అలాగే, నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా రైతులు తమ పొలాల్లో పంట కుంటల నిర్మాణం చేపట్టాలని డీఏఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వి.శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, ఏఈఓ డి.నరేష్, పీఏసీఎస్ చైర్మన్ సీహెచ్.లక్ష్మీనారాయణ, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రత్యేక లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: చెక్‌బౌన్స్ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించేందుకు శనివారం ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టంద్వారా పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈమేరకు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస సూచించారు.
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈగా యుగంధర్
ఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో బదిలీల నేపథ్యాన నూతన అధికారులు శుక్రవారం విధుల్లో చేరారు. ఆర్‌అండ్‌బీ ఖమ్మం సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా ఉన్న యాకూబ్ ఉద్యోగ విరమణ చేయడంతో, నేషనల్ హైవేస్ ఈఈ వి.యుగంధర్‌కు పదోన్నతి కల్పించి ఈ స్థానంలో నియమించారు. ఇక ఈఈగా మహబూబ్‌నగర్ నుంచి బదిలీపై వచ్చిన టి.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, ఖమ్మం ఆర్‌అండ్‌బీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా వరంగల్ నుంచి పదోన్నతిపై వచ్చిన ఎస్.గణేశ్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు టెక్నికల్ ఆఫీసర్ యర్రా రమేశ్, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
31 లోగా
ఈ–కేవైసీ పూర్తి చేయాలి
ఖమ్మంసహకారనగర్: రేషన్‌కార్డుదారులు కుటుంబ సభ్యులందరి ఈ–కేవైసీ (బయోమెట్రిక్) ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్‌బాబు సూచించారు. పలువురు కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరి ఈ–కేవైసీ పూర్తి చేయగా, ఇంకొందరు మిగిలి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రయోజనాలు నిరంతరాయంగా అందేందుకు ప్రతీ కుటుంబ సభ్యుడి ఈ–కేవైసీ పూర్తి చేయాలని, ఇందుకోసం రేషన్‌షాపుల్లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.


