ఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మం లీగల్: ప్రతీ చిన్నారికి విద్య హక్కుగా లభిస్తుందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధగా చదివితే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా న్యాయ సేవా సంస్థ(డీఎల్‌సీఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.దేవీమానస తెలిపారు. దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల, జూనియర్ కాలేజీలో శుక్రవారం మిషన్ బాల సురక్ష – శిక్షా ప్లాన్ తదితర అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో న్యాయమూర్తి దేవీమానస మాట్లాడుతూ పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం అమల్లో ఉందని తెలిపారు. విద్యార్థినులు ఇతర అంశాలపై దృష్టి సారించకుండా శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరడం ద్వారా ఇంకొందరికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే, హక్కులను తెలుసుకోవడమే కాక క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా అలవర్చుకోవాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు ఉచిత న్యాయ సాయం, రక్షణ, వారి హక్కులను వివరించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి దేవీమానస


