‘సర్’లో దూసుకెళ్తున్న
మహిళా బీఎల్‌ఓలు
గువ్వలగూడెం, రాజేశ్వరపురంలో వంద శాతం పూర్తి
పక్కా ప్రణాళికతో లక్ష్యసాధన
తొలుత ఓటరు మ్యాపింగ్ ముగించాం. ఇది వంద శాతం పూర్తవడంతో తదుపరి ప్రక్రియలు సులువయ్యాయి. మా బూత్ పరిధిలో 12వ తేదీ నాటికి ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. నిరక్షరాస్యులు, వృద్ధుల ఫారాలు మేమే నింపాం. – పాలడుగు రమాదేవి,
గువ్వలగూడెం, బీఎల్‌ఓ
మా బూత్ పరిధిలో గడువులోపే వంద శాతం డిజిజలైజేషన్ పూర్తి చేయడంసంతోషంగా ఉంది. ఇంటింటా ఫారాలు సేకరించాం. ఓటర్లకు ఫారాలు నింపడం, కావాల్సిన పత్రాలపై అవగాహన కల్పించడంతో అందరూ మాకు సహకరించారు.
– వడ్లమూడి కల్పన, రాజేశ్వరపురం, బీఎల్‌ఓ
ఓటరు జాబితా సవరణ(సర్)ను మండలంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు మొదటి నుంచే ప్రణాళిక రూపొందించాం. నిరంతరం పర్యవేక్షణలో చకచకా సాగుతోంది. గడువుకు ముందే లక్ష్యాన్ని పూర్తిచేస్తామనే నమ్మకం ఉంది.
– పి.రాంప్రసాద్, తహసీల్దార్, నేలకొండపల్లి
నేలకొండపల్లి: ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఓ చోట ఓటర్లు ఇంట్లో లేరని.. ఉన్నవారికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చినా నింపలేదని.. నింపినా తిరిగి ఇవ్వలేదని, సిబ్బంది రావడం లేదంటూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి కారణాలతోనే డిజిటలైజేషన్ గడువును వచ్చేనెల 3వరకు పొడిగించారు. కానీ నేలకొండపల్లి మండలంలోని ఇద్దరు బీఎల్‌ఓలు గడువుకు ముందే లక్ష్యాన్ని చేరుకోవడం, వీరిద్దరూ మహిళలు కావడం విశేషం. ‘సర్’ ప్రక్రియలో తొలినాళ్ల నుంచే నేలకొండపల్లి మండలం ఆదర్శంగా నిలుస్తోంది. మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోనే అగ్రభాగాన నిలిచి తహసీల్దార్ పి.రాంప్రసాద్ అవార్డు అందుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో 90 శాతం దాటారు. తహసీల్దార్‌కు తోడు డీటీలు కనకం నరసింహారావు, సుందర్‌సింగ్ తదితరుల నిత్య పర్యవేక్షణ పనులు చకచకా సాగుతున్నాయని బీఎల్‌ఓలు చెబుతున్నారు.
రెండు కేంద్రాల్లో శతశాతం
నేలకొండపల్లి మండలంలోని 32జీపీల్లో 49,395మంది ఓటర్లు ఉన్నారు. ఈమేరకు 59మంది బీఎల్‌ఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో గువ్వలగూడెం, రాజేశ్వరపురం బీఎల్‌ఓలు నూరు శాతం ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ కూడా చేయించారు. ఓటరు మ్యాపింగ్ సాఫీగా సాగడంతో బీఎల్‌ఓల పనులు సులువయ్యాయని తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. కాగా, గువ్వలగూడెం బీఎల్‌ఓ పాలడుగు రమాదేవి 243 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటర్ల డిజిటలైజేషన్ 16రోజుల్లోనే పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ బూత్ పరిధిలో 876 మంది ఓటర్ల డిజిటలైజేషన్ 12వ తేదీనే ముగించారు. ఇక రాజేశ్వరపురం పోలింగ్ బూత్ నంబర్ 237 బీఎల్‌ఓ వడ్లమూడి కల్పన 267 మంది ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తిచేశారు. ఇంకొందరు బీఎల్‌ఓలు లక్ష్యసాధనకు చేరువలో ఉన్నారు.


