‘అన్న చెయ్యేస్తే మాస్‌.. అన్న లుక్కేస్తే మాస్‌.. మమ మాస్‌..’ | Sakshi
Sakshi News home page

‘అన్న చెయ్యేస్తే మాస్‌.. అన్న లుక్కేస్తే మాస్‌.. మమ మాస్‌..’

Published Tue, Dec 5 2023 5:34 AM

కౌంటింగ్‌ కేంద్రం వద్ద అభివాదం చేస్తున్న పొంగులేటి   - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్న చెయ్యేస్తే మాస్‌.. అన్న లుక్కేస్తే మాస్‌.. మమ మాస్‌..’ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల్లో పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు కనిపించింది. జిల్లాలో తిరుగులేని మాస్‌ లీడర్‌గా ఉన్న ఆయన మరోసారి తన చరిష్మా చూపించారు.

బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటుతో..
వైఎస్సార్‌ సీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత లభించక ఈ ఏడాది ఆరంభంలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఆయన విసిరిన సవాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ రాజకీయంగా ఓసారి దెబ్బతిన్న ఆయన తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆచితూచి అన్ని అంశాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్‌లో చేరారు.

తగ్గేదే లే...
కాంగ్రెస్‌లో చేరే సమయంలో పదింట ఎనిమిది సీట్లు పొంగులేటి వర్గీయులకే ఇస్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కమ్యూనిస్టుల కోసం కొత్తగూడెం సీటు వదులుకోవాల్సి వచ్చింది. పాలేరు, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట సీట్లు పొంగులేటి వర్గానికి దక్కాయి. గత అనుభవాలు నేర్పిన పాఠంతో ఓర్పుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే తన అనుయాయుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు పొంగులేటి ఎంట్రీ ఇచ్చేవరకు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి రాకతో పరిస్థితి మారిపోయింది. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరసి నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడమే కాదు మెజార్టీలోనూ దుమ్ము రేపారు.

Advertisement
Advertisement