తొలి పీఠానికి పోటా పోటీ
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు బుధవారం తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ బలాన్ని చూపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో మేయర్ పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీగా తాయిలాలు అందిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఒక్కో ఓటుకు రూ.2000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. మిగతా వార్డుల్లోనూ గెలుపు ధీమా ఉన్న వారు రూ.2000 వరకు పంపిణీ చేయగా, మిగిలిన అభ్యర్ధులు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఇచ్చారని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకోగా.. సీపీఐ, టీడీపీతో జత కట్టింది. బీఆర్‌ఎస్ అధికారికంగా ఎవరితోనూ పొత్తు లేకున్నా.. ఆయా డివిజన్లలో స్థానిక పరిస్థితులను బట్టి లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతోంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 30 సీట్లు మహిళలకు రిజ్వర్ కాగా పాలకవర్గంలో 30 మంది పురుషులు, 30 మహిళలు ఉండే అవకాశం ఉంది. మేయర్ స్థానం ఎస్టీ జరనల్‌కు రిజర్వ్ కాగా ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ సామాజిక వర్గం వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ సారి 56 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది.
కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. మున్సిపాలిటీకి నాలుగు సార్లు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 1971లో నోటిఫైడ్ ఏరియాగా ఏర్పాటు కాగా, 1988లో నోటిఫైడ్ ఏరియాకు కమిటీని నియమించారు. అందులో చైర్మన్, కమిటీ సభ్యులు ఉండే వారు. అధికారులు కమిటీ సభ్యుల నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహించే వారు. కాలక్రమేణా 1995లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. తర్వాత 2000 సంవత్సరంలో 25 వార్డులతో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అ సమయంలో గరీబ్‌పేట పంచాయతీలో ఉన్న చిట్టి రామవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పడు పాతకొత్తగూడెం మొదటి వార్డుగా ఏర్పాటుచేసి, వరుసగా వార్డులకు నంబర్లు కేటాయించారు. ఆ తర్వాత 2005లో కూడా 25 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో గొల్లగూడెంను మొదటి వార్డుగా కేటాయించి, మిగతా వార్డులకు వరుసగా నంబర్లు కేటాయించారు. 2014లో మూడోసారి ఎన్నికలు జరగగా, పెరిగిన ఓటర్లకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 33కు పెంచారు. 2020లో 36 వార్డులతో నాలుగోసారి ఎన్నికలు నిర్వహించారు. 2025లో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలిపి మొత్తం 60 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, తొలిసారి బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.
కొత్తగూడెం కార్పొరేషన్‌కు
నేడు మొదటిసారి ఎన్నిక


