● రామయ్యకు స్నపనం, సుదర్శన చక్రస్నానం ● నేటి నుంచి నిత్యకల్యాణం తిరిగి ప్రారంభం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఘనంగా పవిత్ర పూజలతో ముగింపు పలికారు. స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం కమనీయంగా నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రాన్ని, ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర గోదావరి వద్దకు వచ్చారు. పునర్వసు మండపంలో స్వామివారిని కొలువుదీర్చి స్నపన తిరుమంజనం, హారతులను సమర్పించారు. అనంతరం గోదావరిలో సుదర్శన చక్రానికి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం జరిపా రు. సాయంత్రం ధ్వజవరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు నిర్వహించారు. యాగశాలలో పుష్పయాగం, పూర్ణాహుతిలతో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు. సాయంత్రం శేషవాహనంపై స్వామివార్ల ను కొలువుదీర్చి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవను వైభవోపేతంగా జరిపారు. ఈ పూజల్లో ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్ దంపతులు, ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయంలో భక్తుల రద్దీ
హనుమాన్ జయంతి సందర్భంగా రామాలయంలో గురువారం రద్దీ నెలకొంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ మాల ధారులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దేవస్థానంలోని అభయాంజనేయస్వామి ఉపాలయంలో అర్చకులకు తమ ఇరుముడిని సమర్పించారు. అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు.
నేటి నుంచి నిత్యకల్యాణం, దర్బారు సేవ
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడా మండపంలో నిలిపివేసిన నిత్యకల్యాణం, దర్బారు సేవ శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. స్వామివారి నూతన పర్యంకోత్సవం ఈ నెల 11న జరపనున్నారు. అదే రోజు పవళింపు సేవ కూడా నిర్వహించనున్నారు. ఈనెల 23న శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ, సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు.


