● ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల అరెస్ట్ ● ‘సైబర్’ కేసులో ఇప్పటివరకు 48కి చేరిన అరెస్టుల సంఖ్య
సత్తుపల్లి: అమాయకుల నుంచి రూ.కోట్లలో దండుకున్న వారిపై నమోదైన సైబర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మూల్ అకౌంట్లు ఇచ్చి ఆర్థిక నేరాలకు సహకరించిన ముగ్గురు బ్యాంకు ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిబ్రవరి 24న ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉడతనేని వికాస్ చౌదరితో పాటు 14 మంది పేర్లతో కేసు నమోదైంది. ఇదే కేసులో భద్రాద్రి జిల్లా చండ్రుగొండ సీఎస్‌బీ బ్యాంక్ మేనేజర్ అఖిల్ అబ్దుల్‌కు సహకరించిన కస్టమర్ రిలేషన్ ఆఫీసర్లు ఓర్సు కృష్ణ(బెండాలపాడు, చండ్రుగొండ మండలం), మందా శ్రీహరిబాబు(బయ్యన్నగూడెం, పెనుబల్లి మండలం), బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ జుంజునూరి రాధాకృష్ణ(మద్దుకూరు, చండ్రుగొండ మండలం)ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం
తొలుత సైబర్ మోసంలో రూ.547 కోట్లు లావాదేవీలు జరిగినట్లు భావించినా, విచారణ తర్వాత మరింత ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. ఈమేరకు పోట్రు మనోజ్‌కల్యాణ్ ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన సతీమణి మేడా భానుప్రియ ఖాతాలో రూ.40.21 కోట్లు, బావమరిది మేడా సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి(మనోజ్ కల్యాణ్ బినామీ) ఖాతాలో రూ.81.72 కోట్లు, నర్సింహా కృష్ణ(కరీంనగర్) ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్‌చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ నగదుతో నిందితులు కూడబెట్టిన ఆస్తుల జప్తునకు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లకు పోలీసులు లేఖలు రాశారు. కాగా, కల్లూరు డివిజన్ పరిధిలో నమోదైన రెండు సైబర్ క్రైం కేసుల్లో ఇప్పటివరకు 48 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, కమీషన్లకు ఆశపడి 130 మంది మూల్ అకౌంట్లు ఇచ్చినట్లు తేలిన నేపథ్యాన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈవిషయమై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మాట్లాడుతూ సైబర్ కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలి పారు. నిందితుల ఆస్తుల జప్తునకు సంబంధిత శాఖలకు లేఖలు రాశామని వెల్లడించారు. నేరాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోమని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇంకా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.


