ఆస్తి దక్కకుండా అడ్డుకున్నాడని.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తి దక్కకుండా అడ్డుకున్నాడని..

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

● సుఫారీ ఇచ్చి అంతం చేయించేందుకు యత్నం ● మాజీ సర్పంచ్‌ కిడ్నాప్‌ కేసులో నిందితుల అరెస్టు

● సుఫారీ ఇచ్చి అంతం చేయించేందుకు యత్నం ● మాజీ సర్పంచ్‌ కిడ్నాప్‌ కేసులో నిందితుల అరెస్టు

ముదిగొండ: మండలంలోని పండ్రుగుపల్లి మాజీ సర్పంచ్‌, ప్రస్తుత సర్పంచ్‌ భర్త పాము శిల్వరాజు కిడ్నాప్‌ కేసులో పది మందిని అరెస్ట్‌ చేసినట్లు ముదిగొండ సీఐ మురళి తెలిపారు. వీరి నుంచి రెండు వాహనాలు, రూ.1.05లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈమేరకు ముదిగొండ పోలీసుస్టేషన్‌లో సీఐ మురళి గురువారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

భూవిషయంలో వివాదం

పండ్రేగుపల్లికి చెందిన ఎస్‌.కే.ఇబ్రహీం, ఎస్‌.కే.ఫకృద్దీన్‌ అన్నదమ్ములు కాగా, ఫకృద్దీన్‌ హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఇబ్రహీం తల్లిదండ్రులను పోషించాడు. ఇందుకు గాను ఇబ్రహీంకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని గ్రామపెద్దలు సూచిస్తారు. ఈ విషయంలో శిల్వరాజు కూడా ఇబ్రహీం తరఫున నిలబడతాడు. అయితే, ఇందుకు విరుద్ధంగా ఫకృద్దీన్‌, ఆయన కుమారులు బోదల్‌సాహెబ్‌, ఖాసిం సాహెబ్‌ హైదరాబాద్‌ నుంచి పలువురితో వచ్చి జనవరిలో ఫెన్సింగ్‌ వేస్తుండగా శిల్వరాజు అడ్డుకోగా కోపం పెంచుకున్నారు.

రూ.15లక్షలకు ఒప్పందం

మాజీ సర్పంచ్‌ శిల్వరాజును అంతం చేయాలనే భావనతో బోదల్‌ సాహెబ్‌ తన స్నేహితులైన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మహమ్మద్‌, మెయిర్బాన్‌సింగ్‌, సిక్లికర్‌ కుల్‌జీత్‌సింగ్‌, సిక్లికర్‌ ఆజాద్‌సింగ్‌, కోమల, ఇస్మాయిల్‌, ఎండీ.నూర్‌, వరికుప్పల తరుణ్‌తో మాట్లాడాడు. శిల్వరాజుతో రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.రూ 5లక్షల అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఆపై హైదరాబాద్‌ వాసులు ఎనిమిది మంది మార్చి 24న అశోక్‌ లేలాండ్‌ ట్రక్‌లో పండ్రేగుపల్లికి వచ్చి, మార్చి 25వ తేదీన ఉదయం శిల్వరాజు వాకింగ్‌ వచ్చిన సమయాన కిడ్నాప్‌ చేశారు. మధ్యలో కారులోకి మార్చి హైదరాబాద్‌ తీసుకెళ్లారు. ఈమేరకు ఫిర్యాదు రావడంతో ముదిగొండ సీఐ మురళి ఆధ్వర్యాన ఎస్‌ఐ అశోక్‌, సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తూ నిందితుల ఆచూకీని గుర్తించడంతో హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో శిల్వరాజును వదిలేసి పారిపోయారు. అప్పటి నుంచి గాలిస్తుండగా హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు పారిపోతున్నారనే సమాచారంతో ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి టోల్‌ప్లాజ్‌ వద్ద గురువారం ఏడుగురితో పాటు ఫకృద్దీన్‌, ఆయన ఇద్దరు కుమారులు బోదల్‌, ఖాసింను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మురళి తెలిపారు. నిందితుల్లో నూర్‌ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ అశోక్‌తో పాటు, ఏఎస్‌ఐ ఖలీఖ్‌, కానిస్టేబుళ్లు కృష్ట, అంజయ్య, రాకేష్‌కు ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement