హొసపేటె: కళ్యాణ కర్ణాటక(క–క) ప్రాంతానికి స్వేచ్ఛా స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అత్యంత అర్థవంతంగా జరుపుకోవాలని అదనపు జిల్లాధికారి పీఎన్.లోకేష్ అన్నారు. తన కార్యాలయ సభామందిరంలో నిర్వహించిన ప్రాథమిక సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 8 గంటలకు నియమావళి ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండాను ఎగురవేస్తారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది జిల్లా స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. జిల్లా శాఖలకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ శ్రద్ధగా నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. అనంతరం పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తుందన్నారు. ప్రముఖులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. సబ్ డివిజనల్ అధికారి వివేకానంద, కన్నడ సంస్కృతి శాఖ సహాయ సంచాలకులు సిద్దలింగేష్ రంగన్నవరతో సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.


