మార్కెట్‌ యార్డులో ముఖ్యమంత్రి తనిఖీ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ యార్డులో ముఖ్యమంత్రి తనిఖీ

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

రైతులతో కలిసి ఇడ్లీలు ఆరగిస్తున్న సీఎం డీకే

కూరగాయల రైతులతో సీఎం డీకే

యశవంతపుర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మంగళవారం ఉదయం బెంగళూరులోని యశవంతపుర ఏపీఎంసీ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. రైతులు, వ్యాపారస్తులు, కూలీ కార్మికులతో మాటామంతీ జరిపారు. సీఎం రాకతో అధికారులు, రైతులు సంభ్రమానికి లోనయ్యారు. ఏపీఎంసీలో సమస్యలు, తూకంలో మోసాలు, వేలంలో వంచనల గురించి రైతులు సీఎంకు వివరించారు. రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు, టెంకాయలు తదితరాలను పరిశీలించి వారితో మాట్లాడారు. మహిళా చిరు వ్యాపారులతో కలిసి సీఎం కాఫీ తాగారు. మార్కెట్‌లోకి వచ్చే వాహనాల నుంచి పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారా, వ్యాపారులు కమీషన్‌ తీసుకుంటున్నారా అని రైతులను ప్రశ్నించారు. యశవంతపురలో లేదని, కలబుర్గి, బీదర్‌, విజయపుర మార్కెట్‌లో కమీషన్‌ వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు. మండీ వ్యాపారులు సక్రమంగా పన్నులు కడుతున్నారా? అని విచారించారు. రైతులకు అన్యాయం చేయకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.

కార్యదర్శి సస్పెండ్‌

జీవర్గి తాలూకా హిట్టనహళ్లి నుంచి వచ్చిన రైతులు అక్కడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని సస్పెండ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

బాల కార్మికులు ఉండరాదు

యశవంతపుర మార్కెట్‌లో బాలలతో పని చేయించరాదని సీఎం స్పష్టంచేశారు. బాలలతో పనిచేయించేవారిపై క్రిమినల్‌ కేసును నమోదు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీఎం ఇడ్లీ ఆరగించారు.

10న 100 రోజుల వేడుక

బనశంకరి: సీఎం డీకే పదవిని చేపట్టిన 10వ తేదీకి వంద రోజులు అవుతుంది. ఆ రోజున ప్రత్యేక సమావేశం జరపనున్నారు. ఇందులో పాల్గొనాలని మాజీ సీఎం సిద్దరామయ్య నివాసానికి వెళ్లి సీఎం డీకే ఆహ్వానపత్రిక అందించారు. గంటపాటు చర్చలు జరిపారు.

యశవంతపుర ఏపీఎంసీలో డీకే శివ

రైతులు, వ్యాపారులతో సమస్యలపై ఆరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement