మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలో దేవలాపుర బస్టాండ్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. కేటీఎం బైక్‌లో వేగంగా వెళ్తున్న ఇద్దరు.. ఓ స్కూటర్‌ను ఢీకొని, ఆ తర్వాత రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో కిందపడిపోయారు. తీవ్రగాయాలైన అక్కడే మరణించారు. మృతులు బెంగళూరుకు చెందిన అభిషేక్, ప్రేమ్ కుమార్ అని తెలిసింది. స్కూటరిస్టు కాలికి గాయమైంది. నాగమంగళ రూరల్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దేవలాపుర పట్టణంలో రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో, ఆ రహదారి ఏకమార్గంగా మారి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఇతర ప్రాంతాలవారు ఇక్కడి రోడ్లు తెలియక వేగంగా వెళ్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరారు.
ప్రదోష్ అప్రూవర్‌కు బ్రేక్
బనశంకరి: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నిందితుడు దర్శన్‌కు ఓరకంగా ఊరట లభించింది. సహ నిందితుడు ప్రదోష్ ఎస్.రావ్ అప్రూవర్‌గా మారతానని ప్రకటించడం తెలిసిందే. ఇందుకు కింది కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో దర్శన్ శిబిరంలో తీవ్ర ఆదుర్దా నెలకొంది. ప్రదోష్ అప్రూవర్‌ని దర్శన్ వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించి.. నగర 59వ సీసీహెచ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చారు. వారంలోగా ఆ ప్రక్రియను పునఃపరిశీలించి కొత్తగా ఆదేశాలు ఇవ్వాలని కింది కోర్టుకు ఆదేశించారు.
బంగ్లా కోసం ఒత్తిడి
చేయలేదు: మంత్రి
బనశంకరి: బెంగళూరు క్రిసెంట్ రోడ్డులోని మాజీ మంత్రి హెచ్‌సీ.మహదేవప్ప ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మంత్రి బైరతి సురేశ్ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. మంత్రి అక్కడ మరమ్మతు పనులు కూడా ప్రారంభించారు. దీనిపై మంత్రి బైరతి సురేశ్ మాట్లాడుతూ మహదేవప్పతో ఎలాంటి గందరగోళం లేదని, అక్కడ ప్రజాపనుల శాఖ అధికారులు పనులు చేస్తున్నారని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పారు. ఖాళీ చేయాలని నేను మహదేవప్పను ఒత్తిడి చేయలేదన్నారు. సీఎం అనుమతి ఇస్తే మహదేవప్ప అదే ఇంట్లో ఉండవచ్చునని, నాకు ఇబ్బంది లేదని అన్నారు.
మంగళూరు జైల్లో
భారీగా మొబైళ్లు
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు జైల్లోకి మొబైల్‌ఫోన్లు సరఫరా అవుతున్నట్లు తెలియడంతో స్థానిక బర్కే ఠాణా పోలీసులు సోదాలు చేశారు. 10 స్మార్ట్ ఫోన్లు దొరికాయి. మంగళవారం ఉదయం ఎ–బ్లాక్‌లో భారీగా సోదాలు నిర్వహించారు. మొబైళ్లు లభించిన నిందితులందరూ వివిధ క్రిమినల్ కేసుల్లో ఉన్నవారని విచారణలో బయట పడింది. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాట వినకపోతే కాల్చి పారేస్తా
● అధికారులకు మంత్రి హెచ్చరిక
హుబ్లీ: మొన్నటికి మొన్న ఇస్లాం మతాన్ని పొగుడుతూ హజ్ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి ఈసారి మాట వినని అధికారులను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా గున్నాళ గ్రామంలో జరిగిన జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారి మాట వినడో నాకు చెప్పండి, ఆ అధికారిని కాల్చి పారేస్తానంటూ ఆగ్రహించారు. యలబుర్గ తహసీల్దార్ ప్రకాష్‌ను వేదికపైకి పిలిచి తాను మంత్రి బాధ్యతల్లో పూర్తిగా బిజీగా ఉంటా, నువ్వే నా పీఆర్‌ఓగా పని చేయాలంటూ సూచించారు. తమ ప్రభుత్వంలోని గ్యారెంటీ పథకాలు ఎప్పటిలా కొనసాగుతాయన్నారు.


