సాక్షి,బళ్లారి: ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెట్టిన పంటలు దెబ్బతినగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేక, చేసిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఓ రైతు మంగళవారం చికిత్స ఫలించక మృతి చెందారు. తాలూకాలోని మోకా గ్రామానికి చెందిన శరభయ్య అనే రైతు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి దాదాపు రూ. 20 లక్షల అప్పు చేశారు. పంటలు పండక, అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. తక్షణం కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడిన శరభయ్య మరణించారు. మృతుడికి భాఽర్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిబంధనలు తప్పకుండా పాటించాలి
హుబ్లీ: ఈసారి గణేష్ చవితి ఉత్సవాల్లో నియమాలను తూచ తప్పకుండా పాటించాలని నిర్వాహకులకు నగర కొత్త పోలీస్ కమిషనర్ భూషణ్ బుర్సే సూచించారు. వినాయక చవితి నేపథ్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండళ్ల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అనుకూలం కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే నియమాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో ప్రతి పోలీస్‌ను కఠినంగా హెచ్చరిస్తున్నానన్నారు. ముఖ్యంగా నిమజ్జనోత్సవాల్లో జరిగే పూజలు, పునస్కారాలు, ఇతర కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోను సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించరాదని సూచించారు. నిర్వాహకులకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు.
మా సొమ్ము తిరిగి ఇప్పించండి
రాయచూరు రూరల్: నగరంలోని దర్వేశి కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బు తిరిగి చెల్లించాలని పెట్టుబడిదార్లు డిమాండ్ చేశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షులు అంబాజీ మైదునకర్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపి ప్రజలకు టోపీ వేసిన కంపెనీ నుంచి నిధులు వాపస్ ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి డిపాజిట్లుగా తీసుకున్న డబ్బులను కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పించాలని కోరుతూ అసిస్టెంట్ కమిషనర్ హంపన్నకు వినతిపత్రం సమర్పించారు.
చేతివృత్తిదారులకు శిక్షణ
మండ్య: సంప్రదాయక చేతివృత్తిదారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలు చేస్తున్నట్లు జిల్లాధికారి డాక్టర్ కుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లా కమిషనర్ కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద 18 సాంప్రదాయ చేతివృత్తిదారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో సహా వివిధ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక కేంద్రం అధికారి దినేష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతీయ కరాటే పోటీల్లో సత్తా
రాయచూరు రూరల్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన 13వ జాతీయ కరాటే పోటీల ఫైనల్స్‌లో రాయచూరుకు చెందిన వైష్ణవి పాటిల్ మూడో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. కరాటే అకాడమీ అధ్యక్షుడు రామచంద్ర, శిక్షకులు అనిరుధ్, పవన్ సుఖాణి, ఆశా, రాజాశంకర్ ఆమెను అభినందించారు.
గణేష్ పండుగ
ప్రశాంతంగా జరుపుకోండి
రాయచూరు రూరల్: జిల్లాలో ప్రశాంతంగా గణేష్ పండుగను జరుపుకోవాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. నగరసభ కార్యాలయంలో జరిగిన శాంతి సమావేశంలో ఆమె మాట్లాడారు. 14వ తేదీన వినాయకులను ప్రతిష్టించాలని, 22వ తేదీన నిమజ్జనం చేయాలన్నారు. డీజేల అమరికను పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత లౌడ్ స్పీకర్లను వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, పోలీస్ అధికారులు శాంత వీర, దాదావలి, ఉమేష్, మంజునాథ్‌లున్నారు.


