చిన్నారి కిట్టయ్యలు | - | Sakshi
Sakshi News home page

చిన్నారి కిట్టయ్యలు

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

మైసూరు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మైసూరు సరస్వతీపురంలోని శ్రీకృష్ణధామలో చిన్నారులు ఆకట్టుకున్నారు. సుమారు 120 మంది పిల్లలు కృష్ణ, రాధా, గోపికల వేషధారణలో మురిపించారు. విజేతలకు కాణియూరుమఠం శ్రీవిద్యావల్లభతీర్థ స్వామీజీ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.

అన్నదాత ఆత్మహత్య

మండ్య: రాష్ట్రంలో తీవ్ర కరువు కారణంగా అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బలేత్తిగుప్పె గ్రామంలో అప్పుల భారం భరించలేక ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు. వివరాలు.. సోమయ్య కుమారుడు బి.ఎస్‌.చంద్రశేఖర్‌ (39), 1.23 ఎకరాల భూమిలో టమాటా, ఇతర పంటలు పండించేవాడు. ఇందుకోసం రూ. 25 లక్షల వరకూ అప్పులు చేశాడు. తీర్చమని అతనిపై ఒత్తిడి తేవడం, కరువు కారణంగా కలత చెంది పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పాండవపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

సహజీవనంలో విషాదం.. మహిళ అనుమానాస్పద మృతి

చిక్కబళ్లాపురం: అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్‌ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్‌ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్‌ కోసం గాలిస్తున్నారు.

5వేల టెంకాయల నీళ్లతో అభిషేకం

బొమ్మనహళ్లి: దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నగరంలోని శరవు మహా గణపతి ఆలయంలో స్వామివారికి మంగళవారం వేలాది కొబ్బరి నీళ్లతో అభిషేకించారు. భాద్రపద శుక్ల పక్ష చతుర్థికి ముందు వచ్చే ఏకాదశినాడు గణపతి స్వామికి ఇలా అభిషేకిస్తారు. మొదట పంచామృత అభిషేకం, ఆ తర్వాత కొబ్బరినీటితో అభిషేకం, పూజలు చేశారు. ఏడాదికోసారి జరిగే ఈ వేడుకను చూడడానికి అశేష భక్తులు తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచే భక్తులు టెంకాయలను తీసుకొచ్చి ఆలయంలో అందజేశారు. 5 వేలకు పైగా కొబ్బరికాయలు సమకూరాయి. రాఘవేంద్ర శాస్త్రి, సరావు సుదేశ్‌ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement